యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సర్వేల పేరుతో వైసీపీ నేతల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదుచేసిన వేదాయపాలెం పోలీసులు ఆయన్ను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తొలుత జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. కోటంరెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. అక్రమంగా సర్వేలు చేపడుతున్న వ్యక్తులను వైసీపీ కార్యకర్తలు పట్టుకున్నారని గుర్తుచేశారు. వీరిని పోలీసులకు అప్పగించగా, వైసీపీ నేతలపైనే పోలీసులు ఎదురుకేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.