యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
స్వదేశంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆఖరాట ఆడేశాడు.. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వన్డేలకు ధోనీ బరిలోకి దిగడం లేదు. ఈ రెండు మ్యాచ్‌ల నుంచి ధోనీ విశ్రాంతి కోరాడని భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బంగర్ ఈ విషయాన్ని మీడియాతో చెప్పాడు. 'రెండు వన్డేలకు జట్టులో మార్పులు చేయాలనుకుంటున్నాం. ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ధోనీకి విశ్రాంతినిస్తున్నాం. అతని స్థానంలో యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. కాలి గాయంతో మహ్మద్ షమీ కూడా మరుసటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు' అని బంగర్ అన్నాడు. తర్వాతి మ్యాచ్‌లలో కచ్చితంగా తుదిజట్టులో మార్పులు ఉంటాయని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.ఆదివారం ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఆసీస్‌తో సొంత ఇలాఖా రాంచీలో ఆడిన ధోనీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఆసీస్‌తో మ్యాచ్ ఆఖరాటగా భావిస్తున్నారు. మెగాటోర్నీ ముగిసిన తర్వాత భారత్‌కు స్వదేశంలో ఎలాంటి సిరీస్‌లు లేవు. ఇదిలా ఉంటే ధోనీకి ఘనంగా వీడ్కోలు పలుకాలని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నది