యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు స్కానింగ్ పరికరాలు అందజేయడంతోపాటు పట్టణాల్లో ఇంటింటికీ ట్యాగ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. చెత్త సేకరించటానికి వెళ్లిన సమయంలో ఈ పరికరంతో ట్యాగ్‌ను స్కానింగ్ చేయగానే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందింప చేయించింది. తడి, పొడి వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలించి సేంద్రీయ ఎరువులుగా మార్చడం, విద్యుదుత్పత్తి చేసేలా ప్రైవేటు సంస్థలతో పురపాలక శాఖ ఒప్పందాలు చేసుకునేలా చేసింది.
జిల్లాలో 12 పురపాలక సంఘాలుండగా వీటిలో నిత్యం 960 టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు. అందుకు పారిశుద్ధ్య విభాగంలో రూ.82 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణను పక్కాగా నిర్వహించి అన్ని పట్టణాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దటానికి చర్యలు చేపట్టారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్టవేసి పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. వ్యర్థాలు తరలించే డంపింగ్ యార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ప్రహరీలు, రోడ్లు నిర్మించారు.
ఇళ్ల నుంచి తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. కొత్తగా 279 జీవోను ప్రవేశపెట్టారు. వ్యర్థాలు సేకరించటానికి అవసరమైన వాహనాలను రూ.8 కోట్లతో కొనుగోలు చేశారు. పట్టణంలో ప్రతి 300- 350 గృహాలను ఓ మైక్రో ప్యాకెట్గా విభజించారు. ప్రతి దానికీ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు, ఓ తోపుడు బండిని కేటాయించారు. గతంలో పారిశుద్ధ్య విభాగంలో గుత్తేదారులు అక్రమాలకు పాల్పడేవారు. తక్కువ మంది సిబ్బందితో పని చేయించి రికార్డుల్లో ఎక్కువ మందిని చూపించి రూ.లక్షల్లో స్వాహా చేసేవారు. వీరికి అధికారులు సహకరించి వాటాలు తీసుకునేవారు. వందల సంఖ్యలో ఒప్పంద కార్మికులను నియమించినా ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి అక్రమాలను అరికట్టడానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటికి ఓ ట్యాగ్ అమర్చారు. పారిశుద్ధ్య సిబ్బందికి స్కానింగ్ పరికరాలను పంపిణీ చేశారు. వీటి వినియోగంపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ పరికరాలు గుంటూరులోని డీఎంఏ కార్యాలయంలోని ఆర్టీఎంఎస్, సీఎం డ్యాష్ బోర్డుతో అనుసంధానమై ఉంటాయి. అమరావతిలో అధికారులకు రాష్ట్రంలో ఏ పట్టణంలోనైనా ఆ రోజు కార్మికులు ఇంటికి వెళ్లి చెత్త, సేకరించారా లేదా అన్న విషయం వెంటనే తెలిసిపోతుంది. బాపట్ల పురపాలికలో ప్రయోగాత్మకంగా అమలు చేయడం ప్రారంభించారు. రోజూ 13 వేల గృహాల్లో ట్యాగ్‌లు స్కానింగ్ చేయాల్సివుండగా ప్రస్తుతం 350 ఇళ్లకే చేస్తున్నారు.
కొత్త విధానంలో పని చేయటానికి పారిశుద్ధ్య కార్మికుల ఇష్టపడడం లేదు. వారితో అధికారులు మాట్లాడి అంతా వివరించి చెప్పి పూర్తిగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు. మాచర్ల పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మిక సంఘం నేతలు పరికరాల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్యాగ్‌లు స్కాన్ చేయడానికి ససేమిరా అంటున్నారు. పిడుగురాళ్ల, రేపల్లెలో పరికరాలు అందజేసినా వినియోగించడం లేదు. చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండలో ట్యాగ్‌లు అమర్చినా పరికరాలు ఇవ్వలేదు. పురపాలక సంఘాల్లో ప్రతి రోజూ వ్యర్థాలు సేకరించాల్సివున్నా రోజు మార్చి రోజు కార్మికులు విధులకు వెళ్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని ఇతర పనుల్లో వినియోగించడంవల్ల కొరత ఏర్పడుతోంది. దీనిని అరికట్టి అందరితో పని చేయిస్తే లక్ష్యం మేరకు ప్రతి ఇంటి నుంచి వ్యర్థాలు సేకరించవచ్చు. ప్రైవేటు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేసి వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్తు తయారు చేసే ప్లాంట్లు ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం పురపాలక ఉన్నతాధికారులపై ఉంది.