YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పుల్వామా సూత్రధారులు హతం

పుల్వామా సూత్రధారులు హతం

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:       

జమ్మూ కశ్మీర్‌లో అర్ధరాత్రి పుల్వామా జిల్లా త్రాల్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎనిమిది గంటలపాటు సాగిన ఈ  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. వీరిలో పుల్వామా ఆత్మాహుతి దాడి సూత్రధారుల్లో ఒకడైన ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్  మహద్ భాయ్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ముగ్గురు ఉగ్రవాదుల మృత‌దేహాలను స్వాధీనం చేసుకున్న సైన్యం, వారిని గుర్తించే పనిలో ఉంది. త్రాల్ సమీపంలోని  పింగ్లష్‌ లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రత దళాలు ఆదివారం అర్ధరాత్రి అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమై ధీటుగా బదులిచ్చింది. దాదాపు 8 గంటలపాటు సాగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల్ని ఆర్మీ  మట్టుబెట్టింది. సైన్యం కాల్పుల్లో హతమైన ఉగ్రవాది మహద్ భాయ్ స్వస్థలం పుల్వామా జిల్లా త్రాల్ పట్టణంలోని మిర్ మొహల్లా. డిగ్రీ చదివిన అతడు ఎలక్ట్రీషియన్‌గా ఏడాది  డిప్లొమా చేశాడు. పుల్వామా ఆత్మాహుతి దాడికి అతడే వాహనం, పేలుడు పదార్థాలను సమకూర్చినట్టు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఇక, 2017లో జైషే మహ్మద్  ఉగ్రవాద సంస్థలో చేరిన మహద్, తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసే నూర్ మహ్మద్ తాంత్రే అనుచరుడిగా ఉన్నాడు. అయితే, 2017 డిసెంబరులో నూర్‌ ను  భారత సైన్యం మట్టుబెట్టడంతో 2018 జనవరి 14 నుంచి అజ్ఙాతంలోకి వెళ్లిపోయి, ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. పుల్వామా దాడికి పాల్పడిన  మానవ బాంబు అదిల్ అహ్మద్ దార్‌ తో ముదాసిర్ తరుచూ సంభాషించినట్టు అధికారులు తెలిపారు. సాధారణ కూలీ కుమారుడైన మహద్, 2018 ఫిబ్రవరిలో సుంజ్వాన్ ఆర్మీ  స్థావరంపై దాడికి పాల్పడి ఆరుగురు జవాన్లను చంపిన ఘటనతోనూ ఇతడికి సంబంధం ఉంది.  

Related Posts