YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వీడియో కాన్ కేసులో ఈడీ దూకుడు

 వీడియో కాన్ కేసులో ఈడీ దూకుడు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:       
 

ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ గ్రూప్ రుణం కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో  చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లతోపాటు వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్‌ ను సుదీర్ఘంగా ప్రశ్నించి విచారణను ఈడీ అధికారులు వేగవంతం చేసిన  విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొచ్చర్ దంపతులకు అందిన ముడుపులపైనా దృష్టి సారించారు. వీడియోకాన్ గ్రూప్‌లోని రెండు సంస్థల నుంచి కొచ్చర్లకు ముడుపులు  అందాయన్న ఆరోపణలున్నాయి.దీంతో పన్ను స్వర్గధామాలుగా పేరున్న దేశాలకు ఈ లంచం సొమ్ము తరలించారా? అన్న కోణం లో విచారణపై ఈడీ కన్నేసినట్లు సంబంధిత  వర్గాలు తెలియజేస్తున్నాయి. నిధుల మళ్లింపుపై కొచ్చర్ దంపతులను మేము విచారించాం. ఈ విషయంలో వారి బంధువులను, కొందరు అనుచరులనూ ప్రశ్నించాం అని ఈడీ  సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సోదాల్లో, విచారణలో వెల్లడైన సమాచారం ద్వారా కొన్ని నేర పత్రాలను సీజ్ చేశాం. ఈ క్రమంలో కొచ్చర్లు తీసుకున్న ముడుపులు..  పన్నులే లేని దేశాలకు పంపించిన సంకేతాలున్నాయి అని తెలిపారు. అయితే ఏ దేశానికి ఈ సొమ్ము వెళ్లిందన్న వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు. ఈ సమాచారం  బయటకు పొక్కితే విచారణకు అంతరాయం కలుగవచ్చన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ గ్రూప్ రుణం కేసులో సమగ్ర దర్యాప్తు  దిశగా ఈడీ అడుగులు వేస్తున్నది. చందా కొచ్చర్ క్విడ్ ప్రోకో ఆరోపణలపై లోతుగా విచారిస్తున్న అధికారులు.. ఆమె హయాంలో వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు బ్యాంక్  మంజూరు చేసిన రుణాలపై, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌తో ఎస్సార్ గ్రూప్ వ్యాపార సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వీడియోకాన్, ఫస్ట్‌లాండ్ హోల్డింగ్స్‌ల నుంచి దీపక్ కొచ్చర్‌ కు  చెందిన నూపవర్ రెన్యువబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్) పొందిన రుణాలు ఏవీ లేవని మేం తెలుసుకున్నాం. కానీ చందా కొచ్చర్ హయాంలో తమ గ్రూప్ సంస్థలకు అందిన  రుణాలకుగాను కొచ్చర్ దంపతులకు లంచాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది అని సదరు ఈడీ సీనియర్ అధికారి చెప్పారు. దీంతో ఈ ముడుపుల సొమ్ము ఏమైంది?.. విదేశాలకు  తరలించారా? లేదా ఆస్తులను కొన్నారా? అన్న కోణంలో ఈడీ తెలుసుకుంటున్నది. ఫస్ట్‌లాండ్ హోల్డింగ్స్, మాట్రిక్స్ గ్రూప్‌లతో సంబంధాలను ఆదా యం పన్ను (ఐటీ) శాఖ  ఇచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రెండు సంస్థలు ఎస్సార్ గ్రూప్ వైస్ చైర్మన్ రవి రుయా అల్లుడు నిశాంత్ కనోడియాకు  చెందినవి.ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద క్రిమినల్ కేసును ఈడీ నమోదు చేసిన విషయం తెలిసిందే. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్,  వేణుగోపాల్ ధూత్‌లతోపాటు వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఈఎల్), వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (వీఐఎల్)ల పేర్లనూ కేసులో ఈడీ పేర్కొన్నది.  కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, అందులో ధూత్ స్థాపించిన సుప్రీం ఎనర్జీ, దీపక్ కొచ్చర్ పెట్టిన నూపవర్ రెన్యువబుల్స్  పేర్లున్నాయి. వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు మంజూరైన రూ. 1,875 కోట్ల రుణాల్లో అవకతవకలు జరిగాయని, చందా కొచ్చర్ స్వప్రయోజనాలకు పెద్దపీట వేశారని, ఇందుకే  దీపక్ పెట్టిన నూపవర్‌లో పెట్టుబడుల పేరిట రూ.64 కోట్ల లంచం ధూత్ ఇచ్చారని సీబీఐ, ఈడీలు వాదిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గత విచారణలోనూ ఇది తేలడంతో  కొచ్చర్‌ను తొలగించినట్లు బ్యాంక్ ప్రకటించిన సంగతి విదితమే.

Related Posts