యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వలసలు, బుజ్జగింపులు, ఎన్నికల వ్యూహాలతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఆసక్తికరపరిణామం జరిగింది. ఈ మధ్యే వైసీపీకి రాజీనా చేసిన వంగవీటి రాధాకృష్ణ.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని కలవడం ఆసక్తికరంగా మారింది. రాధా తన సన్నిహితులతో కలిసి నానితో భేటీ అయ్యారు. గుడివాడలోని ఏలూరు రోడ్డులో ఉన్న ఫర్నీచర్ పార్క్లో ఈ భేటీ జరిగింది. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వైసీపీలో ఉన్నప్పుడు రాధా, నానిలు మంచి స్నేహితులు.. ఆ సన్నిహితంతోనే కలిశారనే ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు వంగవీటితో నాని చర్చలు జరపడం కూడా చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో తనను ఘోరంగా అవమానించారని.. ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా ఎన్నికల్లో పనిచేస్తానని రాధా ఈ మధ్యే చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారానికి కూడా వెళతానన్నారు. మళ్లీ కొద్దిరోజులకే వైసీపీ ఎమ్మెల్యేతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.