యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ప్రకటనకు ముందే పార్టీలో చేరికల పర్వాన్ని ముగించాలని నేతలకు జగన్ సూచించినట్లు సమాచారం. పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నదెవరు? టికెట్ల విషయంలో వారి డిమాండ్లు ఏంటి? అనేది కొలిక్కి తెస్తే అభ్యర్థులను ఖరారు చేద్దామని వెల్లడించినట్టు తెలుస్తోంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు అక్కడకు చేరుకుని, ముందుగా భాస్కరవర్మ కల్యాణ మండపంలో ప్రముఖులు, మేధావులు, తటస్థులతో నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సమర శంఖారావం వేదిక వద్దకు చేరుకుని బూత్ కమిటీల కన్వీనర్లు, సభ్యులు, గ్రామ, మండల, రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత తొలి సభ కావడంతో ఇదే వేదికపై నుంచి జగన్ ఎన్నికల సమర శంఖం పూరించారు. ఇక, మార్చి 14, లేదా 15 నుంచి బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తోన్న వైసీపీ అధినేత, దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. తన పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలోని 134 నియోజకవర్గాలను పర్యటించిన జగన్, మిగతా 41 చోట్ల బస్సు యాత్ర చేపట్టునున్నారు. తర్వాత పరిస్థితులను బట్టి ఇతర నియోజకవర్గాల్లో దీనిని కొనసాగించనున్నారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందే అభ్యర్థులను ప్రకటించాలా? లేదా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల రోజు మొత్తం అభ్యర్థులను ప్రకటించడమా? అనే అంశంపై చర్చించారు. ఒకవేళ తొలి విడతగా జాబితా ప్రకటిస్తే 100 నుంచి 120మంది పేర్లు అందులో ఉంటాయని తెలుస్తోంది.