యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ముహూర్తం ఖరారు కావడంతో రాష్ట్రంలోని రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈసారి రాష్ట్రంలో బహుముఖ పోటీ జరగనుంది. అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షం వైకాపాతోపాటు, భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు బరిలో దిగుతున్నాయి. తెదేపా, వైకాపాలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై చాలావరకు కసరత్తు పూర్తి చేశాయి. ఏ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయన్న విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇప్పటి వరకూ వామపక్షాలు, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ముందస్తు కసరత్తు చేసిన పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దించి ప్రచార బరిలోకి దిగనున్నాయి.రాష్ట్ర విభజన తర్వాత పలు కష్టాల్ని ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవి. రాజధాని అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం కీలక దశలో ఉంది. విభజన తర్వాత ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి ఇప్పుడిప్పుడే ఐటీ, పారిశ్రామిక, ఉత్పాదక రంగాల తోడ్పాటు లభిస్తోంది. విభజన గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి కానీ ఆర్థిక లోటు ఇప్పటికీ వేధిస్తోంది. తలసరి ఆదాయంలో మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జరగనున్న ఎన్నికలు ఏ కోణంలో చూసినా అత్యంత కీలకమైనవి.అధికార తెదేపా ఎన్నికల సన్నద్ధతలో మిగతా రాజకీయ పార్టీల కంటే ఒకడుగు ముందే ఉంది. ముఖ్యంగా అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో గతానికి భిన్నంగా పనిచేసింది. ఇప్పటికే 60శాతంపైగా అభ్యర్థుల్ని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. వారిలో కొందరు ఎన్నికల ప్రచారమూ ప్రారంభించారు. మరో 10 నుంచి 20 శాతం అభ్యర్థుల్ని ఒకటి రెండు రోజుల్లోనే ఖరారు చేయనున్నారు. పోటీ ఎక్కువగానూ, ఎంపిక కొంత సంక్లిష్టంగానూ ఉన్న 20 నుంచి 30 శాతం నియోజకవర్గాల విషయంలో కొంత సమయం తీసుకునే అవకాశముంది. చిత్తూరు వంటి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ముఖ్యమంత్రి ఆరేడు నెలల క్రితమే ఖరారు చేశారు. గత రెండు మూడు వారాలుగా ఆయన పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టారు. రోజుకు 2 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ స్థానాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ముఖాముఖి సమావేశమై అభ్యర్థిత్వం ఖరారు చేసిన వారికి వెళ్లి పని చేసుకోవాలని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఆదివారం అరకు నియోజకవర్గ నాయకులతో ముఖాముఖి సమావేశాలు జరిగాయి. సోమవారం నరసరావుపేట నాయకులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దాంతో 25 లోక్‌సభ స్థానాలపై కసరత్తు పూర్తవుతుంది. ఆశావహులు ఎక్కువగా ఉండటం, వర్గ విభేదాల వంటి కారణాలవల్ల అభ్యర్థుల ఎంపిక సంక్లిష్టంగా ఉన్న నియోజకవర్గాలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆధ్వర్యంలోని రెండు కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపద్యం లోతెదేపా తరఫున 100కిపైగా అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
క్షేత్ర స్థాయిలో సేవామిత్రలు, బూత్ కమిటీ కన్వీనర్లు, ప్రాంతీయ సమన్వయకర్తల్ని వేల సంఖ్యలో నియమించడం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియనూ ఇటీవలే పూర్తి చేశారు. రాష్ట్రంలో తెదేపాకు 65లక్షలకుపైగా సభ్యులున్నారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున సేవామిత్రలను, ప్రతి బూత్‌కు ఒక కన్వీనరును, ప్రతి 10 బూత్‌లకు ఒక ప్రాంతీయ కన్వీనరును నియమించారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.పార్టీపరంగా ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు చేపడుతూ పార్టీ కేడర్ నిరంతరం ప్రజల్లో ఉండేలా చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం, సైకిల్ యాత్రలు, గ్రామదర్శిని వంటి కార్యక్రమల ద్వారా ప్రతిఎమ్మెల్యే, నాయకులు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ వెళ్లేలా చేశారు.ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకుల్ని చేర్చుకోవడంద్వారా పార్టీని మరింత పటిష్ఠం చేశారు.గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయానికి దోహదం చేస్తాయన్న నమ్మకంతో తెదేపా ఉంది. ఇటీవల కాలంలో అమలు చేసిన పసుపు- కుంకుమ, వృద్ధాప్య పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచడంతోపాటు, ఇతర పింఛన్ల మొత్తాన్నీ పెంచడం, అన్నదాత- సుఖీభవ వంటి పథకాలు విశేష ఆదరణ పొందాయని పార్టీ భావిస్తోంది.
కాగా2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన వైకాపా... ఈసారి ఎన్నికల్లో చావోరేవో అన్న స్థాయిలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ ఎన్నికల కోసం వైకాపా అధినాయకత్వం మూడున్నరేళ్ల నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వచ్చింది. అప్పట్లోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకుంది. ఆయన బృందం క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా పార్టీ బలాలు, బలహీనతలు, పార్టీ అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేస్తే లాభిస్తుంది వంటి అంశాలపై సర్వేలు నిర్వహించింది. వాటి ఆధారంగా కొన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పులు చేర్పులు చేపట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు క్షేత్ర స్థాయి కార్యక్రమాల అమలు వంటివి చేపడుతూ వచ్చింది. 31 మంది నేతలతో పార్టీ మేనిఫెస్టో కమిటీని వేసి కసరత్తును కొలిక్కి తీసుకొస్తోంది. 2017లో గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో వైకాపా మేనిఫెస్టోలో ఉండబోయే ప్రధాన హామీలైన ‘నవరత్నాల’ను జగన్ ప్రకటించారు.ప్రత్యేక హోదా అంశంపై మొదట్లో పూర్తిగా దృష్టి సారించిన వైకాపా అధ్యక్షుడు అధ్యక్షుడు జగన్.. యువభేరుల పేరుతో విశ్వవిద్యాలయాలు, డిగ్రీ తత్సమాన విద్యార్థులు, నిరుద్యోగ యువతతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించారు. హోదా అంశమే అజెండాగా ఎన్నికలకు వెళతామని, ఎన్నికలయ్యాక కేంద్రంలో ఎవరు హోదా ఇస్తే వారి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తామని జగన్ ప్రకటించారు.2017 నవంబరులో ప్రారంభించి 2019 జనవరి వరకూ 14 నెలలపాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సమయంలోనే జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా కసరత్తు చేశారు.‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ కొత్త ప్రచార కార్యక్రమానికి వైకాపా శ్రీకారం చుట్టింది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా జిల్లాలవారీగా సమర శంఖారావం పేరుతో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ప్రారంభించిన ఈ సభలు ఇప్పటివరకూ కడప, అనంతపురం, నెల్లూరులో పూర్తికాగా, సోమవారం కాకినాడలో జరగనుంది. ఇప్పుడు జిల్లాల్లో బస్సు యాత్రకు జగన్ సిద్ధమవుతున్నారు.
గత ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ద్వారా తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ప్రత్యేక హోదా అజెండాగా రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా 4 సార్లు రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. కేంద్రంలో అధికారంలోకొస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యం ఇస్తుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ‘ఇంటింటికీ కాంగ్రెస్’ పేరుతో రాష్ట్రంలోని బూత్ స్థాయిలోని ప్రతి ఇంటికీ వెళ్లింది. తాజాగా ‘ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రెండు మూడు రోజుల్లో శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. కాగా గత ఎన్నికల్లో తెదేపాకు మద్దతిచ్చిన జనసేన ఈసారి వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతుంది. పార్టీ ఆవిర్భావం రోజైన ఈనెల 14న ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఎక్కువ మంది కొత్తవారికే టిక్కెట్లు ఇవ్వనుంది. అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానించగా రాష్ట్ర వ్యాప్తంగా 1,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని వడపోస్తున్నారు. వామపక్షాలతో రెండు, మూడు రోజుల్లో పొత్తు ఖరారు కానుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే అన్ని జిల్లాల పర్యటన ఒక విడత పూర్తి చేశారు. ప్రధానంగా ఆ పార్టీ తమ అధినేత పవన్ కల్యాణ్ గ్లామర్‌పైనే ఆధారపడుతోంది. బలమైన అభ్యర్థుల కోసం విస్తృతంగా అన్వేషిస్తోంది. 2014 ఎన్నికల్లో తెదేపాతో కలిసి పోటీ చేసిన భాజపా ఈసారి ఒంటరిగా బరిలో దిగుతోంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు, సర్జికల్ దాడులు, రాష్ట్రంలో జాతీయ నాయకుల పర్యటనలు పార్టీకి కలిసొస్తాయని భాజపా నేతలు భావిస్తున్నారు. ఇటీవల గుంటూరు, విశాఖపట్నంలలో ప్రధాని మోదీ పర్యటన, బహిరంగ సభలు ఆ పార్టీ ఓటింగ్ శాతాన్ని పెంచుతాయనే ధీమా నాయకుల్లో వ్యక్తమవుతోంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా స్థానాలపై ప్రత్యేకదృష్టి పెడుతోంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులు, కన్వీనర్లు, కో-కనీన్వర్ల నియామకాలు పూర్తి చేశారు. వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లోనూ భాజపా పోటీ చేయనుంది. జై సమైక్యాంధ్ర పార్టీతో కలిసి గత ఎన్నికల్లో సీపీఎం, విడిగా సీపీఐ పోటీ చేయగా ఈసారి జనసేన పార్టీతో కలిసి ఈ రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐల మధ్య పొత్తు విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఒప్పందం లేకపోయినా కొన్నిచోట్ల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేశారు. ఈసారి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే జనసేనతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రెండు విడతలుగా చర్చలు జరిపారు. జిల్లాకు రెండేసి చొప్పున ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వామపక్షాలు కోరుతున్నాయి. ప్రతి జిల్లా నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాయి. సీట్లపై ప్రాథమిక చర్చలు జరిగినా ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.