యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుపై జనసేన పార్టీ దృష్టి సారించింది. ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో పలువురు అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి విడత జాబితాలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు పవన్‌కల్యాణ్ ట్విటర్‌లో వెల్లడించారు. ఇందులో తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల స్థానాలు ఉండే అవకాశం ఉంది. ఈ జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్‌కల్యాణ్‌తో వామపక్ష నేతలు భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేతతో చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై నేతలు ఓ నిర్ణయానికి రానున్నారు. తమకు 26 శాసనసభ, 4 లోకసభ స్థానాలను కేటాయించాలని వామపక్షాలు జనసేన ముందుంచాయి. ఏ నియోజకవర్గాల్లో తమకు బలముందో తెలిపే వివరాలను పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాయి. ఇదే సమయంలో జనసేన ఈ నెల 14న నిర్వహించబోయే పార్టీ ఆవిర్భావ సభకు ముందే అభ్యర్థుల జాబితాపై స్పష్టత ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నారు.