యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సోమవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని మాదా నియోజకవర్గం నుంచి పవార్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని కొద్ది రోజుల క్రితం వార్తొలోచ్చిన విషయం తెలిసిందే. వాటన్నింటినీ కొట్టి పారేస్తూ పవార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.పుణెలో సోమవారం నిర్వహించిన పార్టీ సీనియర్ల సమావేశంలో పవార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మాధా నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయట్లేదని ఆయన తెలిపారు.దీనిపై పవార్ మాట్లాడుతూ..‘నా కుటుంబంతో, స్నేహితులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. తర్వాతి తరాలకు అవకాశమివ్వాలి.ఎంతోమంది నియోజక వర్గ ప్రజలు, పార్టీ నాయకులు నన్ను పోటీ చేయమని అంటున్నారు. వారి మాట కాదని అంటున్నందుకు, వారిని నొప్పిస్తున్నందుకు మన్నించాలి. నా కుటుంబం నుంచి ఇప్పటికే ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను పోటీ నుంచి తప్పుకోవడం ఇదే సరైన సమయం’ అని తెలిపారు. మాదా నుంచి పవార్ మనవడు పార్థ్ పవార్ పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తన మేనల్లుడు అజిత్ పవార్, మరో కుటుంబ సభ్యుడు పోటీ చేయకపోతే తాను బరిలోకి దిగుతానని శరాద్ గత నెలలో తెలిపారు. అయితే వారిద్దరు ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండడంతో తాను తప్పుకుంటున్నట్లు పవార్ ప్రకటించారు. పవార్ ఇప్పటికి 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. బీసీసీఐ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు.మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని సమష్టిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 11 నుంచి మే 19వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను ప్రకటించింది.