యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు.ఈ మేరకు పెండింగ్‌లో ఉంచిన నియోజకవర్గాల నేతలను పార్టీ అధిష్ఠానం అమరావతికి పిలిపించింది. సుమారు 130 నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన.. పెండింగ్‌లో ఉన్న దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని యోచిస్తున్నారు. యనమల, సుజనాచౌదరి ఆధ్వర్యంలోని రెండు సమన్వయ కమిటీల ద్వారా ఆయా నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను సేకరించారు. మాడుగుల, నెల్లిమర్ల, నూజివీడు, గజపతినగరం, మదనపల్లి, తిరువూరు, ఆత్మకూరు, పాతపట్నం, తిరుపతి, ఉదయగిరి, చిత్తూరు, విశాఖ దక్షిణం, చోడవరం, అమలాపురం, పి.గన్నవరం, ప్రొద్దుటూరు నేతలతో సమన్వయ కమిటీలు సమీక్షలు నిర్వహిస్తున్నాయి.మరోవైపు అనంతపురం జిల్లాలోని శింగనమల, కల్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగులను కొనసాగిస్తారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. విశాఖ జిల్లా మాడుగుల నుంచి రామానాయుడు పేరు దాదాపుగా ఖరారైంది. కృష్ణా జిల్లా నూజివీడు నుంచి ముద్రబోయిన, దేవినేని అపర్ణ, అట్లూరు రమేశ్ పోటీ పడుతుండగా.. కైకలూరు నుంచి జయమంగళ వెంకటరమణ, సీఎల్ వెంకట్రావు, దోనెపూడి పవన్ టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కె.అప్పలనాయుడు సోదరుడి నుంచే పోటీ ఎదుర్కొంటున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వరదరాజులు రెడ్డి, లింగారెడ్డి పోటీలో ఉండగా.. కొత్తగా వీరశివారెడ్డి అభ్యర్థిత్వం కూడా తెరపైకి వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల జాబితా మొత్తం ఖరారవుతుందని తెదేపా వర్గాలు చెబుతున్నాయి.