YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్ పై గాంధీల గురి

గుజరాత్ పై గాంధీల గురి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తొలి ప్రసంగంలోనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. మోదీ హామీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయి? మహిళ భద్రత సంగతేంటి? మీరే ఆలోచించండి.. మీ ముందు గొప్పగా మాట్లాడే వ్యక్తి ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు అని ప్రియాంకా ప్రశ్నించారు. మీ ఓటే ఆయుధమని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ర్యాలీలో ప్రియాంకా ప్రసంగించారు. ఈ దేశ ఆత్మ గురించి కొందరు మాట్లాడుతుంటారు.. ప్రస్తుతం వీస్తున్న విద్వేష గాలులను ప్రేమతో పారదోలడమే ఈ దేశ ఆత్మ అని ప్రియాంకా అన్నారు. తొలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆమె ఈ పబ్లిక్ ర్యాలీలో ప్రసంగించారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. ఎక్కడ చూసినా ద్వేషం ప్రజ్వరిల్లుతున్నది. మనమందరం కలిసి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అని ఆమె స్పష్టం చేశారు.ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సమాయాత్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌ను పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరిట పాటీదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని హార్దిక్ పోరాడుతున్నారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు. కాంగ్రెస్ టికెట్‌పై జామ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని హార్దిక్ భావిస్తున్నారు. కానీ పటేళ్ల ఆందోళన కేసులో కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం అవరోధంగా మారే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్మారక్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల సన్నాహాల గురించి చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దాదాపు 58 ఏళ్ల తర్వాత గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న సమావేశం ఇదే కావడం గమనార్హం. 2017 గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 99 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 80 సీట్లు గెలుచుకుంది. వరుసగా ఆరోసారి ఆ రాష్ట్రంలో కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ గట్టిగా పోరాడినా ఫలితం లేకపోయింది.

Related Posts