యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని నిలిపివేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఎన్నికల కమిషన్ను కలిసి సినిమా విడుదల వాయిదా వేసేలా చొరవ చూపాలని కోరారు. సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్గా చూపించారని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలివేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు’
కాగా ఈ విషయంపై చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబును నెగెటివ్గా చూపించారని టీడీపీ భావిస్తోంది. నిజాన్నిఎవరూ దాచలేరని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి’ అని ఆర్జీవీ ట్విట్ చేశారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న విడుదల అని ప్రకటించేశాడు. తాజాగా టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.