యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ కాక రేపుతోంది. ఇద్దరూ బలమైన నేతలుకావడం, ఒకరికి టిక్కెట్ ఇవ్వకపోయినా మరొకరు పార్టీ మారతారన్న వార్తలు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. భూమా ఫ్యామిలీలో ఇప్పటికే మూడు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందులో నంద్యాల టిక్కెట్ భూమాకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. నంద్యాల టిక్కెట్ తోనే కర్నూలు టిక్కెట్ ముడిపడి ఉంది. ఆళ్లగడ్డ టిక్కెట్ ను ఇప్పటికే భూమా అఖిలప్రియకు చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు. స్థానాల్లో సర్వేలు మరోసారి చేయించిన తర్వాతనే టిక్కెట్ ఇవ్వాలన్నది చంద్రబాబు అభిప్రాయంగా ఉంది. కర్నూలు, నంద్యాలలో మరోసారి సర్వే చేయించాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్ వచ్చే అవకాశాలు తక్కువేనంటున్నారు. అక్కడ భూమా బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వానికి ఇటు ఏవీ సుబ్బారెడ్డి, అటు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పోటీ పడుతున్నారు. ఎస్పీవై రెడ్డి తన అల్లుడికి టిక్కెట్ ఇవ్వడంతో పాటు ఏవీ సుబ్బారెడ్డికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెబుతున్నారు.నంద్యాల టిక్కెట్ భూమాకు దక్కకుంటే ఖచ్చితంగా కర్నూలు సీటును ఎస్వీ మోహన్ రెడ్డికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్వీ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటం కూడా కలసి వచ్చే అంశం. ఇక కర్నూలు సీటుకు టీజీ వెంకటేశ్ పోటీ పడుతున్నారు. తన కుమారుడు భరత్ కు టిక్కెట్ ఇవ్వకుంటే టీజీ కుటుంబం పార్టీ మారుతుందన్న టాక్ కూడా బలంగా విన్పిస్తుంది. అయితే టీజీ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకపోవడానికి ఇప్పటికే ఆయన కుటుంబానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చామని చెబుతోంది టీడీపీ.ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన తమకే టిక్కెట్ ఇవ్వాలని టీజీ కుటుంబం కోరుతుంది. గత ఎన్నికల్లో తాము కోట్లు ఖర్చు చేశామని, ఈ ఎన్నికల్లో కూడా టిక్కెట్ ఇవ్వకుంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే టిక్కెట్ విషయంలో చంద్రబాబునాయుడు ఎటూ తేల్చకుండా పెండింగ్ లో పెట్టేశారు. మరోసారి సర్వే చేసి ఆ ఫలితాలను బట్టే టిక్కెట్ కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. అయితే టీజీ కుటుంబం మాత్రం టిక్కెట్ దక్కకుంటే తాము స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగాలన్న యోచనలో ఉంది. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్ వికాస్ యాత్ర పేరట ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. కర్నూలు నియోజకవర్గంలో తమ పట్టు ను వదులుకునేందుకు టీజీ సిద్ధంగా లేరన్నది వాస్తవం. మరి కర్నూలు టిక్కెట్ ఎవరికి దక్కుతుందన్నది రెండు రోజుల్లోనే తేలనుంది.