Highlights
- రాజకీయాల్లోకి ప్రియాంకా రావాలి
- వ్యక్తిగతంగా రాహుల్ అంటే ఇష్టం
- రానున్న ఎన్నికల్లో పోటీ చేయను
- హార్దిక్ పటేల్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నా నాయకుడు కాదని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమనేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా రాహుల్ అంటే నాకు ఇష్టం. కానీ, ఆయన్ను ఓ నాయకుడిగా భావించలేను. ఎందుకంటే రాహుల్‌ను ఎన్నడూ ఓ నేతగా నేను చూడలేదు’ అని పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు రాహుల్‌ను విమర్శిస్తూనే.. మరోవైపు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాల్లోకి రావాలని పటేల్ ఆకాంక్షించారు. ఆమెలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి తరపున ఎంపీగా హార్దిక్ పోటీ చేయబోతున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ..రానున్న ఎన్నికల్లో తాను పోటీచేయబోనని స్పష్టం చేశారు. ‘వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో (ప్రధాని నరేంద్ర మోదీ) వ్యతిరేకంగా పోటీచేయడం లేదంటూ... అసలు ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయగలిగినప్పుడు నన్నెవరూ ఆపలేరు. తానూ అసెంబ్లీ లేదా పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలో ప్రజల నిర్ణయమే శిరోధార్యమన్నారు.