YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముంచుకొస్తున్న ఆర్దిక సంవత్సరం ముగింపు బ్యాంకర్ల చుట్టూ లబ్దిదారుల ప్రదక్షిణలు

ముంచుకొస్తున్న ఆర్దిక సంవత్సరం ముగింపు బ్యాంకర్ల చుట్టూ లబ్దిదారుల ప్రదక్షిణలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

సర్కారు అందించే స్వయం ఉపాధి రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. 2018-19 ఆర్థిక ఏడాది ముగుస్తున్నా వార్షిక ప్రణాళిక మాత్రం అమలుకు నోచడం లేదు. దీంతో స్వయం ఉపాధి పొందాలనుకున్న ఎస్సీ నిరుద్యోగ యువత ఆశలపై అధికారులు నీళ్లు చల్లుతున్నారు. లక్ష్యం చిన్నపాటిదే అయినా రుణాల మంజూరు ఏడాది ఆలస్యం కావడం, అదీ బ్యాంకర్లతో ముడిపడి ఉండటంతో తుది జాబితా ఇంకా ఖరారు కాలేదు. మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం రానుండటంతో ఈయేడు రుణాలపై ఇప్పటికే వేలాది మంది దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి..!
హైదరాబాద్‌ జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ ద్వారా 2018-19 ఏడాదికి ఎస్సీ నిరుద్యోగ యువతకు 519 యూనిట్లను మంజూరు చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. మొత్తం యూనిట్లలో లక్ష రూపాయలలోపు రుణాలను 206 మందికి, 1-2 లక్షల్లోపు రుణాలను 181 మందికి, 2-12 లక్షల రూపాయల్లోపు రుణాలను 132 మందికి అందించాలని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు భావించారు. వాటికోసం జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల దరఖాస్తులందాయి. ఈ మొత్తానికి రూ.14.92 కోట్లు మంజూరయ్యాయి. అందులో ప్రభుత్వం రూ.9.46 కోట్లు సబ్సిడీ రూపంలో అందిస్తుండగా, బ్యాంకర్ల రుణం రూ.5.46 కోట్లు. అయితే రుణాల మంజూరుకు తుది జాబితాను ఖరారు చేయాల్సిన అధికారులు నత్తనడకను తలపిస్తున్నారు. స్వయం ఉపాధి పథకం ద్వారా అందించే ఈ రుణాల్లో యూనిట్‌ ధరను బట్టి ప్రభుత్వ సబ్సిడీ నిర్ణయిస్తున్నది. లక్ష రూపాయల రుణానికి ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ అందిస్తున్నది. మిగతా యూనిట్లకు 60 శాతం, 50 శాతం సబ్సిడీ మంజూరు చేస్తున్నది. ఈ రుణాల్లో మొత్తం యూనిట్‌ ధరలో సగాన్ని కూడా బ్యాంకర్లు భరించడం లేదు. అయినప్పటికీ రుణాల మంజూరుకు బ్యాంకర్లు అనేక కొర్రీలు పెడుతున్నారు. ప్రస్తుతం దరఖాస్తుదారుల తుది జాబితా ఖరారునూ బ్యాంకర్లకు అప్పగించినట్టుగా తెలుస్తున్నది. బ్యాంకర్లు ఫైనల్‌ చేసిన జాబితాలో పేరుంటేనే కార్పొరేషన్‌ సబ్సిడీ మంజూరుకు అధికారులు సిఫార్సు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దరఖాస్తుదారులు రుణం మంజూరుకు తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

Related Posts