యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోడాను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా భాజపా నేత భూపేంద్ర యాదవ్ కలిసిన పిర్యాదు చేసారు.. రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో నెలకొంటున్న వాతావరణంపై వారు అభ్యంతరాలు తెలుపుతూ ఫిర్యాదు చేశారు. సీఈసీని కలిసిన అనంతరం రవి శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల నియమావళి ఇప్పటికే అమలులోకి వచ్చింది. అయినప్పటికీ నిన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఈసీకి మేము ఫిర్యాదు చేశాం.. చర్యలు తీసుకోవాలని కోరాం. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో నెలకొనే ఉద్రిక్త వాతావరణం విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు.. ఆ రాష్ట్రంలో గతంలో ఎలా జరిగాయన్న విషయాలను చెప్పాం. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని చాలా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేశాం. అలాగే, అన్ని పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరింపచేయాలని కూడా కోరాం’ అని రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.