YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతపురం జిల్లాల్లో వేడెక్కుతున్న రాజకీయాలు

 అనంతపురం జిల్లాల్లో వేడెక్కుతున్న రాజకీయాలు
రాయదుర్గం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసిపికి చెందిన బలమైన నాయకుడైన పాటిల్‌ కుటుంబాన్ని టిడిపిలోకి ఆహ్వానించడానికి ఓ వైపు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో టిడిపిలో మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యతిరేకులు తమ నిరసన గళం విప్పారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి బహిరంగ విమర్శలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఏకంగా రాజీనామా అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. దీంతో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ ఛైర్మన్‌ పూల నాగరాజు బుజ్జగింపులకు కూడా మెట్టు గోవిందరెడ్డి మెట్టు దిగలేదు. మెట్టు గోవిందరెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైసిపిలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకోగా పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి వర్గీయులు టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి.
మంత్రి కాలవ శ్రీనివాసులు తీరు నచ్చక మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక వైసిపిలో రామచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పాటిల్‌ వర్గీయులు వైసిపిని వీడి టిడిపిలోకి చేరుతారని ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డికి మృదుస్వభావిగా పేరుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులకు మద్దతుగా నిలిచి ఆయనను గెలిపించడంతో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కృషి చేశారు. తీరా ఎన్నికల్లో గెలిచాక చీఫ్‌విప్‌గా, మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులు మెట్టు, దీపక్‌రెడ్డిలను పక్కన పెట్టారనే విషయాన్ని వారు నిర్మోహమాటంగా ప్రెస్‌మీట్‌ల ద్వారా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ మద్దతు దారుల అభిప్రాయాల మేరకు నడచుకుంటానని స్పష్టం చేశారు. మెట్టు గోవిందరెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేసి ఆలేఖను ఫాక్స్‌ద్వారా అధిష్టానానికి పంపారు. దీంతో అనంతపురం నుంచి జేసీ దివాకర్‌రెడ్డి మంగళవారం ఉదయం మెట్టుగోవిందరెడ్డి నివాసానికి చేరుకుని ఆయనతో మాట్లాడారు. టిడిపిలోనే కొనసాగాలంటూ మెట్టుకు జేసీ దివాకర్‌రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో తనకు , తన మద్దతు దారులకు జరిగిన అవమానాలను మెట్టుగోవిందరెడ్డి ఎంపీకి చెప్పుకుని బాధపడినట్లు సమాచారం. అంతలోనే మంత్రి కాలవ శ్రీనివాసులు మెట్టు నివాసానికి చేరుకుని మాట్లాడారు. గతంలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌తో అలా జరిగిందని అవేవి మనస్సులో పెట్టుకోకుండా పార్టీలో కొనసాగాలని ఈసందర్భంగా మంత్రి చేసిన బుజ్జగింపుకు మెట్టు స్పందించలేదని తెలిసింది. అరగంట పాటు మెట్టుతో ప్రత్యేకంగా మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ పూల నాగరాజు మాట్లాడినప్పటికి ఆశించిన మార్పు కనిపించలేదని సమాచారం. ఇన్నాళ్లకు తాము గుర్తొచ్చామా అని మెట్టు బంధువులు, ఆయన మద్దతు దారులు మంత్రితో అన్నట్లు సమాచారం. దీంతో చేసిదేమీ లేక మంత్రి, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ వెనుతిరిగిన కాసేపటికే వైసిపి కార్యకర్తలు, నాయకులు మెట్టు నివాసానికి చేరుకున్నారు. జగన్‌కు, మెట్టు గోవిందరెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో తన మద్దతు దారులైన టీడీపీ నాయకులకు ఏ పనులు చేయలేదని దీంతో పార్టీకి రాజీనామ చేస్తున్నానని ప్రకటించారు. పార్టీ కష్టకాలంలో ఉనప్పుడు అధినేత ఆదేశంతో ఎమ్మెల్సీగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం వైసిపి నమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి మెట్టు గోవిందరెడ్డి నివాసానికి చేరుకుని మంతనాలు జరిపారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. ఈ నేపథ్యంలో మెట్టు గోవిందరెడ్డి బుధవారం అధికారికంగా వైసిపిలో చేరుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా టిడిపి నుంచి వైసిపిలో చేరిన బొమ్మనహాల్‌ మండలానికి చెందిన ముళ్లంగి నారాయణస్వామి మెట్టును వైసిపిలోకి తీసుకు వచ్చేందుకు కీలకంగా పనిచేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మంత్రి కాలవ పనితీరును, ఆయన అవినీతిని ఎండగడుతూ విబేధిస్తున్న ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై నిరసన గళం విప్పారు. తన కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం మేరకు నడుచుకుంటానన్నారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాలని మద్దతు దారులు దీపక్‌రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీకి దిక్కులేని రోజుల్లో నాయకత్వం వహించి తనకుంటూ క్యాడర్‌ను ఏర్పాటు చేసుకుంటే ఆ పునాదుల మీద కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా విజయం సాధించారని ఆయన అనుచరులు విమర్శిస్తున్నారు. పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఆయన వర్గీయులు ఈనెల 18న అనంతపురంలో టీడీపీ అధినేత పర్యటన సందర్భంగా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే పాటిల్‌ సోదరుడు సదాశివరెడ్డి , కుమారుడు పాటిల్‌ అజరు తమ మద్దతు దారులతో పార్టీ మారే విషయంలో ఎక్కువ సంఖ్యలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి ఇటీవల బళ్లారిలో పాటిల్‌ నివాసంలో వేణుగోపాల్‌రెడ్డిని కలిసి వైసిపిలోనే కొనసాగేలా చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఏది ఏమైనా రాయదుర్గం రాజకీయం ఎన్నికల సమీపిస్తున్న వేళ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది.

Related Posts