యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అభ్యర్థుల జాబితా ప్రకటించే సమయంలో అధికార టీడీపీలో అసమ్మతి సెగలు పెరుగుతున్నాయి. జాబితా అధికారికంగా ప్రకటించకపోయినా ఫలానా చోట్ల కొందరికి సీట్లు కేటాయించినట్లు లీకులు రావడంతో ఆశావాహుల మద్దతు వర్గాలు, అసమ్మతి నేతలు అధినేత వద్ద పోటాపోటీగా నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా మంత్రి శిద్దా రాఘవరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావును ఈసారి ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఆయన మాత్రం దర్శి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబును కోరుతున్నారు. సీఎంతో ఇప్పటికే రెండుసార్లు భేటీ అయినా స్పష్టమైన హామీ రాకపోవడంతో శిద్దా వర్గం ఆందోళన చెందుతోంది. తమ నేతకు దర్శి టిక్కెట్ కేటాయించాల్సిందేనంటూ అమరావతిలో ఆందోళన చేస్తున్నారు. శిద్దా కూడా చంద్రబాబుతో మరోసారి భేటీ అయి తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన అనుచరుల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెబుతున్నారు. స్పీకర్ కోడెల పోటీ చేస్తున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోనూ అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. కోడెల శివప్రసాదరావుకు టిక్కెట్ కేటాయించొద్దంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేస్తున్నారు. కోడెల వ్యతిరేక వర్గం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి జవహర్ పై ఓ వర్గం వ్యతిరేకంగా ఉంది. ఆయనకు టిక్కెట్ కేటాయించొద్దంటూ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కృష్ణా జిల్లా తిరువూరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. టీడీపీ మహిళా నేతల్లో కీలకంగా ఉన్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత కూడా తన నియోజకవర్గంలో అసమ్మతి ఎదుర్కొంటున్నారు. పార్టీ జంప్ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో అనితకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ ఓ వర్గం ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడా ఆమెకు స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్ని వివాదాల మధ్య టీడీపీ విడుదల చేసే అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది.