యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బెంగాల్ టైగర్ మమతాదీదీ ఢిల్లీ పీఠం మీద గురిపెట్టారా? సొంతంగా గద్దెను దక్కించుకోలేకపోయినా కనీసం నిర్ణయాత్మకపాత్ర పోషించాలని అనుకుంటున్నారా? అనేకయుద్ధాల్లో ఆరితేరిన వృద్ధమూర్తులైన కమ్యూనిస్టులను మట్టికరిపించి బెంగాల్ కోటను చేజిక్కించుకున్న దీదీ రెండోసారి గెలవడం ద్వారా తాను ఇలా వచ్చి అలా వెళ్లిపోయే రకం కాదని చాటుకున్నారు. మరోవైపు బీజేపీ ఎలాగైనా బెంగాల్ పై పట్టు సాధించాలని ఎత్తులు వేస్తూనే ఉన్నది. తృణమూల్ తో రకరకాలుగా తలపడుతూనే ఉన్నది. ప్రస్తుతం బెంగాల్లో పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే ప్రధాన పోటీ బీజేపీ, తృణమూల్ మధ్యనే అనేది స్పష్టం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు అస్తిత్వం నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే మమతాదీదీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. బెంగాల్ లోని మొత్తం 42 స్థానాలకు ఆమె పాత, కొత్తల కలయికగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆ లెక్క చూస్తే ఆమె వ్యూహం కొంతమేరకు అర్థమవుతుంది. దీనిని త్రిముఖ వ్యూహంగా చెప్పవచ్చు. ఒకటి.. ప్రస్తుతమున్న 34 మంది సిట్టింగ్ ఎంపీల్లో సుమారు మూడోవంతు మందికి జాబితాలో చోటు దక్కలేదు. ఎనిమిది మందిని పక్కనపెట్టగా మరో ఇద్దరు బీజేపీ శిబిరంలో చేరిపోయారు. ఇక రెండోది 4 మందిజాబితాలో సుమారు 17 మంది పార్లమెంటు ముఖం చూసినవారు కాదు. లేదా నియోజకవర్గం మారినవారు. అంటే వారిని పనితీరును బట్టి అంచనా వేసే అవకాశం లేదు. ఇక మూడోది మొత్తం జాబితాలో 40 శాతం మంది మహిళలు. మహిళా ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయం ఇది. పార్టీ జాతీయ కార్యదర్శి సుబ్రతా బక్షి ప్రతిష్ఠాత్మక కోల్కాతా దక్షిణ్ స్థానాన్ని కోల్కాతా మేయర్ మాలా రాయ్ కోసం త్యాగం చేశారంటే పార్టీ ఆలోచనాధోరణి ఏమిటో అర్థమవుతుంది.
మమతకు షాక్..బీజేపీలోకి ఎమ్మెల్యే
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్. తృణమూల్ కాంగ్రెస్లో కీలకమైన నాయకుడు, భట్పారా నియోజకవర్గం ఎమ్మెల్యే అర్జున్ సింగ్.. భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో చేరే కంటే ముందు ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తో అర్జున్ సింగ్ ఢిల్లీలో చర్చలు జరిపారు. బీజేపీలో చేరిన అనంతరం అర్జున్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మమతా బెనర్జీ నేతృత్వంలో 40 ఏళ్ల పాటు పని చేశాను. కానీ బాలాకోట్ లో జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసినప్పుడు.. ఆర్మీ విశ్వసనీయతను మమత ప్రశ్నించిన సమయంలో తాను బాధ పడ్డాను అని తెలిపారు. దేశం మొత్తం పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినదిస్తే.. మమత మాత్రం ప్రధానిని విమర్శించారు. ఇది చాలా దురదృష్టకరమని అర్జున్ సింగ్ అన్నారు. అంతే కాకుండా బార్రక్ పోర్ లోక్సభ నియోజకవర్గానికి తాను పోటీ చేస్తానని అర్జున్.. మమతకు విన్నవించాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడం కూడా పార్టీ మారడానికి ఒక కారణం.