యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాక్ ప్రధాని నిజంగా ఔదార్యులే అయితే మసూద్ అజార్ ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేసారు. ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోనంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ‘జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు జరిపింది. కానీ పాక్ మిలిటరీ మాత్రం జైషే తరఫున మన దేశంపై దాడికి యత్నించింది. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్ర సంస్థలకు ఆర్థికంగా సాయం చేస్తోంది. తీవ్రవాద రహిత వాతావరణం మధ్యే మేం పాక్‌తో చర్చలు జరుపుతాం. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకెళ్లవు’ అని దాయాది దేశంపై సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజనీతిజ్ఞుడు అని కొంతమంది చెబుతున్నారని, ఆయనకు అంత శక్తే ఉంటే జైషే అధినేత మసూద్ ను భారత్‌కు అప్పగించాలని సుష్మా అన్నారు. అప్పుడే ఆయన ఔదార్యం ఎంతో తెలుస్తుందని అన్నారు.