YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అడుగడుగునా నిర్లక్ష్యం

అడుగడుగునా నిర్లక్ష్యం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కృష్ణా విశ్వవిద్యాలయం పదేళ్ల పాటు బాలారిష్టాలను ఎదుర్కొంది. ఎన్నో ఒడుదొడుకులు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రుద్రవరంలో రూ.72 కోట్లతో నిర్మించిన భవనాలను ఇటీవల ప్రారంభించారు. పరిపాలనా వ్యవహారాల నిర్వహణకు అడ్మినిస్ట్రేటివ్‌, తరగతుల నిర్వహణకు అకడమిక్‌ బ్లాక్‌ వంటివి నిర్మితమయ్యాయి. అధునాతన గ్రంథాలయం, ప్రయోగశాలలు, విశాలమైన తరగతి గదులు, ఐదు సమావేశ మందిరాలు. ఆడిటోరియం వంటివి విద్యార్థుల రాక కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఇతర సదుపాయాల ఏర్పాటుకు నిధులు కూడా సమకూరాయి. సుందరీకరణ నిమిత్తం ఉద్యానవనశాఖ అధికారులు గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. సోలార్ విద్యుత్తు ప్లాంట్‌, లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ప్లాంట్‌ వంటి సదుపాయాలు కొద్దిరోజుల్లోనే సమకూరతాయి.
ప్రస్తుతం ఇక్కడ  తొమ్మిది మంది ప్రొఫెసర్లు, 20 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. 26 మంది అకడమిక్‌ కన్సల్టెంట్లు కూడా తాజాగా నియమితులయ్యారు.  విద్యార్థులకు బోధనాపరమైన ఇబ్బందులన్నీ తీరిపోయాయి. 14 మంది సహఆచార్యుల పోస్టుల భర్తీకి ఇటీవల ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. కోర్టు ఉత్వర్వులను సడలించిన అనంతరం వారంతా విధుల్లో చేరనున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కూడా నియమితులైతే ఇక విద్యార్థులకు ఎటువంటి బోధనాపరమైన సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉండదు. ప్రవేశాలు పెరిగేందుకు అత్యంత కీలకమైన వసతిగృహం ఏర్పాటులో మాత్రం ఒక్క అడుగు కూడా పడకపోవడంతో భవిష్యత్తుకు భరోసా కల్పించలేని పరిస్థితి దాపురించింది.
కేవలం నూతన భవనాల ఏర్పాటుతోనే  విద్యార్థుల ఇబ్బందులన్నీ తొలగిపోయే పరిస్థితి లేదు.  విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే వసతిగృహ ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతో ఉంది.  ‌రూ.72 కోట్ల భారీ వ్యయంతో  నూతన భవనాలు నిర్మాణం జరిగినా వసతిగృహ ఏర్పాటు మాత్రం చేపట్టపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.  పీజీ పరంగా రమారమి 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రవేశాలు పెరగకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ వసతిగృహ సదుపాయం లేకపోవడమేనన్నది  తెలిసిన వాస్తవం. గతంలో విశ్వవిద్యాలయంలో జిల్లా విద్యార్థులే ఎక్కువగా చేరేవారు. అందులోనూ  సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇంజినీరింగ్‌ కళాశాల స్థాపనకు నోచుకోకపోవడం తదితర కారణాలు వల్ల ఇతర జిల్లాల విద్యార్థులు ఇక్కడ చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.  దీంతో ఇక్కడ ప్రవేశాలు లేక వెలవెలబోయే పరిస్థితి ఉండేది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో మచిలీపట్నానికి మహర్దశ పట్టింది. విజయవాడకు అతి సమీపంలోని పట్టణం కావడంతో ప్రభుత్వం కూడా బందరు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిచింది.  జిల్లా కేంద్రం కావడం, పోర్టు నిర్మాణం కానుండటం, అనుబంధ పరిశ్రమల రాకకు మార్గం సుగమం కావడం వెరసి ఇటీవల కాలంలో మచిలీపట్నానికి ఎనలేని ప్రాధాన్యత వచ్చింది. ఈ దశలోనే వర్సిటీకి సొంత భవనాలు ఏర్పాటు చేయడం,  ఇంజినీరింగ్‌ కళాశాల కూడా స్థాపించడంతో క్రమేపీ కృష్ణా విశ్వవిద్యాలయంలో ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు చేరుతున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలకు చెందినవారు ఇక్కడ  చదువుకుంటున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. 
ప్రధాన క్యాంపస్‌కు చెందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు చెందినవారు కావడంతో  బందరులో చిన్నపాటి ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 120 మంది వరకు ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఎక్కువ మంది తాత్కాలిక వసతిగృహంలో ఉంటున్నారు. అక్కడ మౌలిక సదుపాయాల కొరత ఉంది. 200 పడకలతో, సకల సదుపాయాలున్న వసతిగృహ ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలున్నా అవి అమలుకు నోచుకోవాలంటే నిధులు ఉండాలి. వర్సిటీ అధికారులు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ఈ విషయాన్ని ప్రధానంగా చర్చకు తీసుకురావాల్సి ఉంది.

Related Posts