యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పోటీలోని నాయకులకు కోవర్టుల గుబులు పట్టుకుంది. టిడిపి, వైసిపిలో నాయకులను ఈ సమస్య నీడలా వెంటాడుతోంది. చివరికి అది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక పోరుకు సమయం సమీపించింది. తక్కువ రోజుల వ్యవధి మాత్రమే పోలింగ్‌కు ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సత్తాచాటేందుకు నాయకులు అన్ని విధాలా కసరత్తు చేస్తున్నారు. వెన్నంటి ఉండే కొందరితో రహస్య సమాచారాన్ని పంచుకోలేకపోతున్నారు. విపక్షానికి సమాచారం చేరుతుండటంతో కీలక సమాచారం బయటకు చెప్పటానికి భయపడుతున్నారు. ప్రధానంగా ఓ పార్టీలో కొనసాగిన చోటా మోటా నాయకుల నుంచి కార్యకర్తల వరకు పలువురు ఎన్నికల వేళకు ప్రత్యర్థి పార్టీలో చేరిపోయి ఆ పార్టీ గురించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం పరిపాటిగా మారుతుంది. ఇలా వచ్చి చేరిన నేతల్లో కొందరు తమ 'పురిటి' పార్టీ బాగోగులపైనే దృష్టి సారిస్తూ.. పార్టీ మారినా తమ పద్ధతి మార్చుకోకపోవడంతో సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే తాము చేరిన పార్టీలో లోగుట్టును తాము గతంలో పనిచేసిన పార్టీకి ఉప్పందిస్తూ కథ నడిపిస్తుండటం గమనార్హం. కొందరు డబ్బుకు ఆశపడి ఆ దిశగా పనిచేస్తే, మరికొందరు పదవులు ఆశించి, నేతల మెప్పుకోసం ఇదేబాట పడుతుండటం కనిపిస్తోంది. దీంతో నమ్మి చేర్చుకున్న నేతలకు చివరకు ఎదురుదెబ్బ తగులుతుండటం పరిపాటైంది. జిల్లాలోనూ ప్రస్తుతం టికెట్టు దక్కుతుందని సంకేతాలు అందిన అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూనే... ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్తున్నాయి. ఐదేళ్ల నిరీక్షణ, అనేక కష్టనష్టాల అనంతరం దక్కుతున్న పార్టీ టికెట్టు ఈ స్థితిలో నేతలు ఎలాగైనా గెలుపు సాధించాలని కసరత్తు చేస్తుండటం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇక్కడే కొందరు నేతలను కోవర్టుల సమస్య వెంటాడుతోంది.నేతల బలాబలాలు, వారి ఆస్తులు, సొమ్ములు, మద్యం సమకూర్చడం, తాయిలాలు ఇలా అనేక అంశాలపై ఉప్పందిస్తారన్న భయం వెంటాడుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొందరు జాగ్రత్తలు పడుతుంటే మరికొందరు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇక ప్రతి అంశమూ ఇసి నిబంధనలకు లోబడే ఉంటుంది. ఈ నేపథ్యంలో తనిఖీ సిబ్బంది కళ్లుగప్పి సొమ్ము, మద్యం, తాయిలాలు క్షేత్రస్థాయిలో చేర్చాలంటే కష్టతరమయ్యే పరిస్థితి. ఇక్కడే, కోవర్టులు కీలకమైన సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు, తనిఖీ బృందాలకు చేరవేస్తే ఇబ్బంది పడతామన్న వాదన పలువురి నుంచి వినిపిస్తోంది. నేరుగా ఆ అభ్యర్థితో ఢకొీట్టకపోయినా... ఆయన ఆర్థిక మూలాలను తనిఖీల మాటున దెబ్బతీయడం ద్వారా ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యేలా కోవర్టులు అడుగులు వేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో రహస్య సమాచారాన్ని నేతలు బయటకు చెప్పడానికి వెనకాడుతుండటం గమనార్హం. తమకు అత్యంత నమ్మకమైన వారి వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుండగా... ఓ దశలో ఎక్కువ మేరకు స్వయంగా కార్యకలాపాలు పర్యవేక్షించుకునేందుకే మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతుంది.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సొంతంగా ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మండలాలు, గ్రామాల వారీగా భవనాలు, గదులను అద్దెకు తీసుకుని ప్రత్యేక కార్యాలయాల కింద మార్చుకుంటున్నారు. వాటిలో తమ పార్టీ ప్రచారానికి అవసరమైన సామగ్రితో పాటు తాయిలాలను నిల్వ చేసేందుకు వినియోగించు కుంటున్నారు. ఇందుకు రెండు నెలల అద్దెను ముందస్తుగా చెల్లిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ కార్యాలయాల వద్దకు ఎవరు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారు? అనే అంశాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా సిసి కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు నేతల మధ్య చర్చ జరుగుతోంది. వాటిని తమ సెల్‌ఫోన్‌లోనే సమీక్షించుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందులో వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పదంగా ఉన్న నేతలు, కార్యకర్తలను రహస్య కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారన్నదీ మరో వాదన.