యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంత్రి అచ్చెన్నాయుడికి వైసీపీ గట్టి షాక్ ఇవ్వబోతోందా? నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ టెక్కలి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అచ్చెన్నను ఓడించేందుకు రోడ్ మ్యాప్ ను జగన్ రూపొందించారు. రెండు, మూడు నెలల క్రితం వరకూ అచ్చెన్నాయుడిదే విజయం అనుకున్నారంతా. టెక్కలి నియోజకవర్గంలో ఐదేళ్ల నుంచి వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేయడంతో పాటు, నియోజకవర్గంలో తనకు ధీటైన అభ్యర్థి లేకపోవడం ఆయనకు కలసి వచ్చిందనే చెప్పాలి. అచ్చెన్న కూడా నిన్న మొన్నటి వరకూ తనదే గెలుపన్న ధీమాలో ఉన్నారు.టెక్కలి నియోజవకర్గంలో వైసీపీకి సరైన అభ్యర్థి లేరనే చెప్పాలి. గత కొంతకాలంగా ఇన్ ఛార్జిలతో నెట్టుకొస్తున్నారు. అక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న పేరాడ తిలక్ వల్ల అచ్చెన్నను ఓడించడం సాధ్యం కాదని జగన్ భావిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గం నేత దువ్వాడ శ్రీనివాస్ వల్ల కూడా కాదని తేలిపోయింది. దీంతో కిల్లి కృపారాణిని జగన్ వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఆమె కోరిన సీటు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు అభ్యంతరాలు చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోని జగన్ కిల్లికి కండువా కప్పేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై అచ్చెన్నాయుడు కేవలం 8387 ఓట్ల తేడాతో మాత్రమే గెలుపొందారు. కిల్లి కృపారాణి, పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ ముగ్గురూ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారే. టెక్కలి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో కాళింగ సామాజికవర్గం బలంగా ఉంది. కిల్లి కృపారాణి రాకను ఈ ఇద్దరు నేతలు కూడా వ్యతిరేకించారు. అయితే జగన్ పిలిచి క్లాస్ తీసుకోవడంతో కొంత వెనక్కు తగ్గారు. ముగ్గురితో కలిపి జగన్ సమావేశమయ్యారు. ముగ్గురు కలసి పనిచేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని, అచ్చెన్నను ఓడించగలుగుతామని గట్టిగానే జగన్ చెప్పినట్లు తెలిసింది.అభ్యర్థి ఎవరైనా ముగ్గురు కలసి పనిచేయాలని, టిక్కెట్ రాని నేతల విషయం తనకు వదిలిపెట్టాలని జగన్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గురు నేతలు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తాము వారి గెలుపునకు కృషి చేస్తామని జగన్ ఎదుటే చెప్పారు. దీంతో ఈ ముగ్గురు నేతలు ఒక్కటైతే మాత్రం టెక్కలిలో వైసీపీకి తిరుగులేదంటున్నారు. అచ్చెన్నాయుడిపై వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో పాటు, గత ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటే అచ్చెన్నను ఓడించడం పెద్ద కష్టమేదీ కాదంటున్నారు. మరి ఎన్నికల సమయానికి వీరంతా ఒకటయి పనిచేస్తారా? లేదా? అన్నదే ప్రశ్న.