యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శరద్ పవార్.. సీనియర్ రాజకీయ నేత. కుదిరితే ప్రధాని పీఠాన్ని ఎక్కాలన్న కోరిక ఆయనది. అయితే ఆయన ఉన్నట్లుండి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇటీవలే శరద్ పవార్ తాను పోటీ చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలోని మధ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నెల రోజులు గడవకముందే పోటీ నుంచి తప్పుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శరద్ పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక దేశ రాజకీయ పరిణామాలు కూడా ఒక కారణమని చెబుతున్నారు.ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఈసారి పోటీ చేయరని అందరూ భావించారు. కానీ ఆమె రాయబరేలి నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. సోనియా పోటీకి దిగి కూటమిని శాసిస్తారన్న కారణం ఒకటి అంటున్నారు. సోనియా నాయకత్వాన్ని గతంలో శరద్ పవార్ వ్యతిరేకించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో సోనియా విదేశీయతపై న కూడా శరద్ పవార్ కామెంట్లు చేశారు. సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటారని భావించిన శరద్ పవార్ ఆమె తిరిగి పోటీ చేయాలనుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కూటములు ఏర్పడకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ను దూరంగా ఉంచారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ తో ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ, శివసేన, భారతీయ జనతా పార్టీ విడివిడిగా పోటీ చేస్తాయని పవార్ భావించారు. గత కొంతకాలంగా శివసేన బీజేపీపై చిందులు తొక్కడంతో శివసేన విడిగా పోటీ చేస్తే లబ్ది పొందవచ్చని, అందుకోసమే ఆయన మధ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ప్రకటించారని అంటున్నారు.శివసేన, బీజేపీలు కలసి పోటీ చేస్తున్నాయి. సీట్ల ఒప్పందం కూడా కుదిరింది. తాను ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరమై తన వారసులను రంగంలోకి దించాలని ఆయన భావిస్తున్నారు. కుమార్తె సుప్రియా సూలే, మనవడు పార్థ్ పవార్ లను పోటీకి దింపనున్నారు. శరద్ పవార్ గత ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శరద్ పవార్ నిర్ణయం వెనక కాంగ్రెస్ పుంజుకోకపోవడం, భారతీయ జనతా పార్టీ సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత కొంత బలపడటం కారణమని తెలుస్తోంది. మొత్తం మీద శరద్ పవార్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలోనూ విస్తృత చర్చ జరుగుతోంది.