యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గాన్ని మార్చుకునే మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారీ కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రస్తుతం గంటా భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి మారారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా అక్కడి నుంచి విష్ణుకుమార్‌రాజు విజయం సాధించారు. ఇక, 1999లో రాజకీయాల్లోకి వచ్చిన గంటా తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించారు. తర్వాత 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక, 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన పీఆర్పీలో చేరి అనకాపల్లి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 2014 ఎన్నికలకు ముందు తిరిగి సొంతగూటికి చేరుకుని భీమిలి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు క్యాబినెట్‌లో మానవవనరుల మంత్రిగా కొనసాగుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన గంటా ఏ పార్టీలో ఉన్నా ఉన్నత పదవులు దక్కించుకోవడం ప్రత్యేకం. ఇక, టీడీపీ ప్రకటించిన జాబితాలో కొందరు సిట్టింగ్‌లకు నియోజకవర్గాలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా పార్టీ యంత్రాంగం నుంచి వ్యతిరేకత వచ్చిన కారణంగా మంత్రి జవహర్‌ను కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కొవ్వూరు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్థానంలో బాపట్ల లోక్‌సభ సభ్యుడు శ్రీరాం మాల్యాద్రికి అవకాశమిచ్చారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు జనసేనలో చేరడంతో అక్కడ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు కేటాయించారు.