యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న తూర్పు పాలమూరు జిల్లా ప్రజల రైల్వే లైన్ కల కలగానే మిగిలిపోయింది. పదుల సంఖ్యలో పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా గద్వాల మాచర్ల రైల్వేమార్గం మాత్రం అమలుకు నోచడంలేదు. ఎన్నికలు వస్తున్న ప్రతీసారి పోటీలో ఉండే అభ్యర్థులు రైల్వేలైన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని ప్రకటనలు చేయడం.గెలిచాక మరిచిపోవడం సర్వసాధారణమైంది. నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న గద్వాల మాచర్ల రైల్వేలైన్ నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు కలగానే మారిపోయింది.ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా ఉంటోంది. పోటీ చేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్ సాధిస్తామని చెబుతున్నా.. 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వనపర్తిలో జరిగిన సభలో ఈ రైల్వేలైన్ గురించి ప్రస్తావించడంతో మరోసారి ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో గద్వాల మాచర్ల రైల్వే మార్గం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సారి తమకు అవకాశం కల్పిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా ఇదివరకే చెప్పారు.