యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తలకు గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు, పర్సనల్ సెక్రటరీ, అనుచరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకా మృతిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివేకా మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పారు. వివేకా పార్థివదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.
గురువారం వరకు వైసీపీ కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారంలో వివేకా చురుగ్గా పాల్గొన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి విజయం కోసం గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేశారు. రాత్రికి ఇంటికి వచ్చి పడుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున బాత్ రూమ్ కి వెళ్లారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బాత్ రూమ్ లోకి వెళ్లి చూశారు. అక్కడ రక్తపుమడుగులో పడి ఉన్న వివేకాను చూసి వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివేకా తలపై గాయాలు ఉండటం గమనించారు.
చలాకీగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే పరిస్థితి లేదని వివేకా కుటుంబసభ్యులు, అనుచరులు అంటున్నారు.. బాత్ రూమ్ లో కాలు జారిపడి తలకు గాయాలు కావడంతో చనిపోయారా మరో కారణమా అనేది పోలీసుల విచారణ, పోస్టుమార్టం అనంతరం తెలియనుంది.