యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇది వరకు జేబు దొంగల నుంచి మన జేబు కాపాడుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు ఓటు దొంగల నుంచి ఓటును కాపాడుకోవాల్సిన అగత్యం పట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఓటరుగా నమోదు చేయించుకోవడానికి అవసరమైన ఫారం- 6 అందజేయడానికి ఈ రోజు ఆఖరు రోజు అయినప్పటికీ, చట్టప్రకారం నామినేషన్ల చివరి రోజు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉందని గుర్తుచేశారు. ఫారం-6 అందజేసిన తరువాత అధికారులకు దానిమీద విచారించి ఓటరుగా నమోదు చేయడానికి కనీసం పది రోజుల సమయం పడుతుందని, మార్చి 25వ తేదీ నామినేషన్లకు ఆఖరి రోజు కావడం వల్ల, ఎవరికైనా ఓటర్ లిస్టులో పేరు లేదని తెలిస్తే, వెంటనే మీ వివరాలను ఫారం-6లో నింపి సంబంధిత అధికారికి అందజేసి ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటర్ లిస్టులో మీ ఓటు ఉందో లేదో సరి చూసుకోకపోతే పోలింగ్ నాడు ఎంత ప్రయాస పడినా ప్రయోజనం ఉండదన్నారు.స్వార్థ ప్రయోజనాల కోసం నేరం చేయడం నేరస్థులకు అలవాటని చంద్రబాబు ఎద్దేవాచేశారు. అది ఆర్థిక నేరమైనా, సైబర్ క్రైం అయినా నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా చేస్తారని దుయ్యబట్టారు. అధికారం లేకుండానే రాష్ట్రాన్ని దోచుకున్న వారు.. అడుగడుగునా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడిన వారు.. రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, చిచ్చు పెట్టిన వారు.. ఎన్నికల్లో అడ్డదారిన గెలవడానికి ఎంతకైనా తెగిస్తారని విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవడానికి ఈ ఆర్థిక నేరస్థులు, సైబర్ నేరస్థుల నుంచి మీ ఓటు కాపాడుకుని, ఏప్రిల్ 11న వినియోగించుకోవాలని ట్విటర్‌లో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.