యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే మైలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని గుంటుపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి దేవినేనికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటుతో వైసీపీ నేతలకు గట్టిగా బుద్ది చెప్పాలని దేవినేని ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు. గుంటుపల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి దేవినేని ఉమ... కిక్కిరిసిన జనసందోహం నడుమ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రమంతా చంద్రన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారని.... ఎన్నికల్లో 150 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదే అని దేవినేని హామీ ఇచ్చారు.
మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నెల 21న మరోసారి నామినేషన్ వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి తనను ఆశీర్వదించాలని కోరారు. రేపు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకన్న పాదాల దగ్గర ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. గుంటుపల్లి గ్రామంలోని జెండా చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నానితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి దేవినేనిని ముస్లీం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలతో ఆశీర్వదించారు. కుల, మతాలకు అతీతంగా మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మంత్రి వెల్లడించారు. గ్రామంలోని సెయింట్ జోసఫ్స్ రోమన్ కాథలిక్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుంటుపల్లి గ్రామం మొదటి నుంచి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. అన్ని వర్గాల వాళ్లు తనకు అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఎన్నికల్లో ఏకంగా 24 లక్షల ఓట్లను కేసీఆర్ తొలగించారని.... ప్రస్తుతం అదే కేసీఆర్ డైరెక్షన్ లో వైసీపీ నేతలు కూడా మన రాష్ట్రంలో ఓట్లను తొలగిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రతి ఒక్కరు 1950 నంబరుకు ఫోన్ చేసి తమతమ ఓటును పరిశీలించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో గెలవాలంటే చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని.... వైసీపీ వాళ్లు ఐదేళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రచార వాహనాల్లో కేసీఆర్ పార్టీ గుర్తులు కనిపిస్తున్నాయని.... మోదీ, కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ 20 రోజులు తనను ఎన్ని తిట్టాలో అన్ని.... ఎన్నికలు పూర్తైన తర్వాత మళ్లీ ఈ ప్రాంతంలో కనిపించరని మంత్రి ఎద్దేవా చేశారు. 2014లో తనపై పోటీ చేసి ఓడిన వ్యక్తి హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ఐదేళ్లుగా కనీసం నియోజకవర్గంలో కనిపించని వ్యక్తి ఇప్పుడు ప్రజలు కష్టపడుతున్నారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ సామంతరాజు జగన్ హైదరాబాద్ కూర్చుని రాజకీయాలు చేస్తుంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి కోసం నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే వాళ్లు కావాలో... ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే కావాలో రాబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి దేవినేని తెలిపారు. వైసీపీకి ఓటు వేస్తే అది కేసీఆర్ కు, మోదీకి వేసినట్లే అని ఆరోపించారు. ఎన్నికల్ గెలుపు కోసం అన్ని అడ్డదార్లను తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు
2014లో అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. నందిగామ సబ్ జైలులో ఖైదీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తనపై పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి పాలన కావాలో.... అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే అనుభవం ఉన్న చంద్రబాబు పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఏ తప్పు చేయకపోతే జైలులో ఎందుకు ఉన్నారో ప్రతిపక్ష నేతలు ప్రజలకు వివరించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం విపక్షాలు అన్నీ కలిసి చంద్రబాబుపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించామని... రైతుల బాగు చూడలేని వ్యక్తి... పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే సొంత లాభం కోసం రాష్ట్రాన్ని కేసీఆర్ కు తాకట్టు పెడతారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని.... వైఎస్ జగన్ కు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని మంత్రి దేవినేని జోస్యం చెప్పారు. జైలుకు వెళ్లిన దొంగల పాలన కావాలో... అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడి పాలన కావో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.