యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కనక దుర్గాఫ్లైఓవర్ నిర్మాణంతోపాటు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కనకదుర్గ వారధి వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి 65 విస్తరణ పనులు ప్రారంభించి దాదాపు 16 నెలలు అవుతోంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అప్పటికే జాతీయ రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకొచ్చింది. పుష్కరాల నాటికి ట్రాఫిక్ విషయంలో విజయవాడ రూపురేఖలు మారిపోతాయని ప్రకటించిందిఏడాది డిసెంబరునాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆ కంపెనీ మరో సంవత్సరం అంటే ఈ ఏడాది డిసెంబరు వరకూ గడువు కోరుతోంది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు నాటిని పనులను పూర్తి చేయాల్సిందేనని అంటోంది. కానీ అప్పటికి కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కానరావడంలేదు. పనులు ఇప్పటికీ నత్తనడకన 'సాగు'తూనే ఉన్నాయి. కృష్ణలంక ఫీడర్ రోడ్డు వైపు రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి ముందుకు సాగడంలేదు. పిఎన్ బస్‌స్టేషన్ ఎదురు జాతీయ రహదారి రోడ్డు నుంచి నెహ్రూ నగర్ రోడ్డు వరకు రిటైనింగ్ పనులు నెలల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారి, కృష్ణాకరకట్ట మధ్యలో ఉన్న మైదాన ప్రాంత పరిధిలో కృష్ణలంక ప్రాంతం రూపుదిద్దుకుంది. దీని పరిధిలో 22, 23, 24 డివిజన్ల ఉండగా, రెండున్నర లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. కృష్ణలంక ఏర్పడక ముందు వరకు కూడా ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి కృష్ణానదికి కరకట్టగా ఉండేది. తరుచూ వచ్చే వరద ముప్పు నివారణకు ప్రముఖ ఇంజినీర్, మాజీ కేంద్ర మంత్రి కెఎల్‌రావు హయాంలో కృష్ణలంక కరకట్టను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి నుండి కృష్ణలంకలోకి వెళ్లేందుకు అజిత్‌సింగ్ (ఫీడర్) రోడ్డును ఏర్పాటు చేశారు. కృష్ణలంక జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)కి ఆరేడు అడుగుల దిగువన ఫీడర్ రోడ్డు ఉంది. తాజాగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఏడాది క్రితం ఫీడర్ రోడ్డు పున:నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటి నుండి దీని పనులు సాగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రచారార్భాటం చేయడం తప్ప పనులు ముందుకు సాగే ప్రయత్నం చేయడంలేదు. పనులు ప్రారంభమై ఏడాది గడుస్తున్నా ఇంతవరకూ ఈ రోడ్డును ఒక రూపుకు తీసుకురాలేకపోయారు. కృష్ణలంక 22, 23, 24 డివిజన్లలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఈ రోడ్డు అత్యంత ప్రధానమైనది. కృష్ణలంక ప్రాంత పాదచారులు, వాహనదారులు నగరంలోకి, ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఈ మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. రోజువారీ కూలి పనులు, షాపు గుమస్తాలు, చిరు వ్యాపారులు, రైతు బజార్‌తోపాటు వివిధ అవసరాల కోసం ఫీడర్ రోడ్డును దాటుకొని జాతీయ రహదారిమీదుగా మహాత్మాగాంధీ రోడ్డుకు చేరుకోవాలి. నగరంలో ట్రాఫిక్ కష్టాలు అధికమయ్యాయి. పుష్కరాలు కాదుకదా పనులు ప్రారంభించి 16 నెలలవుతున్నా జాతీయ రహదారి విస్తరణగానీ, ఫ్లైఓవర్ పనులుగానీ, కృష్ణలంక ఫీడర్ పనులుగానీ ఓ కొలిక్కిరాలేదు. అవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.