యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్‌సభ ఎన్నికల వేళ ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తుల అంశం మళ్లీ మొదటికొచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ను వదులుకోవడంతోపాటు, పోటీకి సంబంధించి స్పష్టమైన వైఖరి, విధానాలను ప్రకటిస్తే తప్ప సీపీఎంతో పొత్తు పెట్టుకోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. రాజకీయ విధానాల విషయంలో సీపీఐతో చర్చల సందర్భంగా ఓ రకంగా, పత్రికా ప్రకటనలు, ఇతరత్ర సమావేశాల్లో అందుకు భిన్నంగా సీపీఎం రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందని ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించాలని, వామపక్షాలు పోటీ చేయని స్థానాల్లో టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించే బలమైనశక్తికి ఓటేయాలని పిలుపు నిచ్చేందుకు ఆ పార్టీ సిద్ధం కాకపోతే సీపీఐ ఒంటరిగా పోటీచేసేందుకు సిద్ధం కావాలని కార్యవర్గం సూచించింది. పొద్దుపోయే దాకా మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పొత్తులు, సీపీఎం వైఖరిపై వాడీవేడి చర్చ సాగింది. సీపీఎంతో ఇప్పటివరకు మూడు విడతలుగా జరిపిన చర్చల సారాన్ని కార్యవర్గానికి సమన్వయ కమిటీసభ్యులు తెలిపారు. తమిళనాడు, బిహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు కుదుర్చుకుని, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు తెలపమని ద్వంద్వ విధానాలకు పాల్పడుతోందని కొందరు విమర్శించినట్టు తెలిసింది. బీఎల్‌ఎఫ్‌ను వదులుకునేందుకు సీపీఎం సిద్ధం కాకపోతే రాష్ట్రపార్టీ తన వైఖరిని నిర్ణయిం చుకోవచ్చని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఒక్క భువనగిరి స్థానం నుంచే పోటీచేయాలని సీపీఐ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిని పోటీ చేయించాలని కొందరు ప్రతిపాదించగా ఆయన విముఖత వ్యక్తం చేశారు. దీంతో పార్టీ భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, మరో ఒకరిద్దరు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.