యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నంద్యాల రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇంతకు ముందులాగా ఇక్కడ టీడీపీకి సానుకూలత అయితే లేదనే చెప్పాలి. భూమా ఫ్యామిలీకి నంద్యాల నుంచి మరోసారి విజయం అంత సులువు కాదంటున్నారు. ఉప ఎన్నికలకు, ఇప్పటికి పరిస్థితిలో చాలా తేడా వచ్చిందన్నది అంచనా. నంద్యాల టిడీపి టిక్కెట్ ఎవరికి వచ్చినా చెమటోడ్చక తప్పదంటున్నారు. వరుస ఓటములతో ఉన్న శిల్పా కుటుంబానికి కొంత సానుభూతి వాతావరణం ఉండటంకూడా కారణమని చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో జరిగినట్లుగా ఏకపక్షంగా పోలింగ్ జరగన్నది నంద్యాల నియోజకవర్గంలో విన్పిస్తున్న టాక్. గత అసెంబ్లీ ఎన్నికలలో భూమానాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తుమీద టీడీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై కేవలం రెండున్నర వేల ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. ఇప్పటి వరకూ నంద్యాలలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగ్గా టీడీపీ నాలుగు సార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. ప్రస్తుత మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాత్రమే మూడుసార్లు నంద్యాల నుంచి గెలిచారు. తర్వాత భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించి కేవలం సంవత్సన్నర కాలం మాత్రమే కావడం, అభివృద్ధి పనులు వేగంగా జరగకపోవడం కొంత మైనస్ గా మారుతోంది.దీనికి తోడు పార్టీలో గ్రూపు తగాదాలు మామూలుగా లేవు. మూడు వర్గాలుగా విడిపోయిన టీడీపీ విడివిడిగా సమావేశాలు పెట్టుకుని మరీ టిక్కెట్ కోసం ఫైట్ చేస్తుండటం ఇందుకు ఉదాహరణ. నంద్యాల నియోజకవర్గం పరిధిలో గోస్పాడు, నంద్యాల మండలాలతో పాటు నంద్యాల మున్సిపాలిటీ ఉన్నాయి. కాపులు, వైశ్యులు, ముస్లింల ఓట్లు ఇక్కడ ఎక్కువ. టీడీపీలో వర్గ విభేదాలు ఆ పార్టీ కొంపముంచేట్లే కనపడుతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి, భూమా ఫ్యామిలీ, ఎస్పీవై రెడ్డి కుటుంబాలు ఎవరికి టిక్కెట్ దక్కినా మరొకరు మనస్ఫూర్తిగా సహకరించుకునే పరిస్థితి కన్పించడం లేదు.మరోవైపు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శిల్పా ఫ్యామిలీకే టిక్కెట్ ఖరారు చేసింది. శిల్పా మోహన్ రెడ్డి గాని, ఆయన కొడుకు శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి గాని పోటీ చేసే అవకాశముంది. వీరు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. అధికార పార్టీలో సీట్ల కుమ్మలాటల్లో ఉండగా, చాప కింద నీరులా వైసీపీ పనిచేసుకుపోతోంది. ఇక్కడ జనసేనకు పెద్దగా నాయకత్వం లేదు. టీడీపీలో టిక్కెట్ దక్కని వారు ఎవరైనా చేరి పోటీ చేస్తే తప్ప ఇక్కడ దానికి దిక్కులేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు మొత్తం ఇక్కడే మకాం వేసి మరీ గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. వరుస ఓటములతో సానుభూతి సంపాదించుకున్న శిల్పా ఈసారి గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.