యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో వస్తున్న మార్పులు రెండు పార్టీలకే చోటు ఉందన్న బలమైన భావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రాజకీయాల్లో మార్పు రావాలని సినీ కెరియర్ ను పక్కనపెట్టి వచ్చిన పవన్ కల్యాణ్ కు ఇదో పెద్ద ప్రతిబంధకంగా మారింది. వైసీపీ, టీడీపీ వ్యూహాత్మకంగా జనసేన పాత్రను కుదించి చూపేందుకు ప్రయత్నం
చేస్తున్నాయి. సైద్ధాంతికంగా, ఆశయాల పరంగా ఉదాత్త రాజకీయాలను ప్రవేశపెట్టాలనుకుంటున్న పవర్ స్టార్ కు పరిస్థితులు ఏమంత సానుకూలంగా కనిపించడం లేదు. పొలిటికల్ ఎరినాలో పోటాపోటీ వాతావరణం ఉన్నప్పుడు మూడో పక్షం తన సొంతబలాన్ని సైతం కోల్పోతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. దీన్నుంచి పార్టీని గట్టెక్కించే దిశలో సాగిన సభగా జనసేన ఆవిర్భావ యుద్ధ శంఖారావాన్ని చూడాల్సి ఉంటుంది. తాను కూడా రంగంలో ఉన్నానని చెప్పడానికే పవన్ ప్రాధాన్యమిస్తున్నారు. ముగ్గురం రంగంలో ఉన్నాం. మంచి వారెవరో మీరే ఎంపిక చేసుకోండంటూ జనసేనాని ఇచ్చిన పిలుపే పార్టీని రేసులోకి తెచ్చే ప్రయత్నంగా పరిశీలకులు చెబుతున్నారు.జనసేన ఆవిర్భావ సభలో సంప్రదాయ రాజకీయ పార్టీ ధోరణిని అనుసరించడానికి పవన్ ప్రయత్నించారు. రైతులకు పెట్టుబడి సాయం, విద్య, వైద్య పథకాలు, కులాలవారీ రుణాలు, వడ్డీ లేని అప్పులు వంటి వివిధ పథకాలు పేర్లు మార్పే తప్ప అన్ని పార్టీల ప్రణాళికల్లోనూ ఉన్నాయి. అధికారంలో ఉన్నపార్టీ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటూ వాటిలో కొన్నిటిని పట్టాలపైకి కూడా ఎక్కించేస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సైతం అవే పథకాలను ప్రకటించింది. ఈ రేసులో వెనకబడకూడదనే ఉద్దేశంతో జనసేన తన ప్రణాళికలో కూడా వాటిని చేర్చేసింది. పవన్ రైతులను కేంద్రంగా చేస్తూ కొన్ని కొత్త అంశాలను చర్చకు తెచ్చారు. అరవయ్యేళ్లు దాటిన రైతులకు పింఛను అందిస్తామన్నారు. పరిశ్రమల కోసం భూసేకరణ చేస్తే వాటిలోరైతు భాగస్వామ్యం ఉండాలన్నారు. పరిశ్రమలో కొంత వాటా ఇవ్వాలా? లేదా ఉద్యోగం కల్పించాలా? అన్న విషయంలో స్పష్టత రావాలి. భూమిని పెట్టుబడిగా ఇచ్చే రైతుకు న్యాయం చేయాలనే డిమాండు జనసేన మేనిఫెస్టోకు కొత్తదనం తెచ్చి పెట్టిందనే చెప్పాలి. ఉభయగోదావరి జిల్లాలకు సెంటర్ పాయింట్ గా ఉన్న రాజమండ్రిలో సభ పెట్టడం ద్వారా స్తబ్దంగా మారిన పార్టీ వర్గాల్లో కొంత ఉత్సాహం నింపే ప్రయత్నంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.కులపరమైన సమీకరణ చూస్తే ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో ప్రజారాజ్యం సైతం ఇక్కడ్నుంచే అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతమూ జనసేనకు ఇక్కడి నుంచే అత్యధిక ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అంశాన్ని పవన్ నెగటివ్ ఫాక్టర్ గా తీసుకుంటున్నారు. తమ పార్టీని ఈ రెండు జిల్లాలకే కుదించి వేయాలనే దురుద్దేశంతోనే వైసీపీ, టీడీపీలు ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయనేది ఆయన భావన. రాష్ట్రం మొత్తం పార్టీ విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇతర నియోజకవర్గాల్లో ప్రభావం ఉండదనే వాదనను వెలికితెస్తున్నారనే అనుమానాలు జనసేనలో నెలకొన్నాయి. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలూ సాగుతున్నాయనే సందేహాలున్నాయి. జనసేన ఆవిర్భావ సభలో ఈ రెంటిపై స్పష్టత ఇచ్చేందుకు పవన్ ప్రయత్నించడమే ఇందుకు ఉదాహరణ. కులాలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కుటుంబాలు బాగుపడ్డాయంటూ చంద్రబాబు, జగన్ లపై ధ్వజమెత్తారు. తాను కాపు కులానికే పరిమితం కానని చెప్పేందుకు మరోసారి యత్నించారు. పార్టీ విస్తరణకు ప్రతిబంధకాలు ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే పవన్ సొంత సామాజిక వర్గాన్ని సొంతం చేసుకునేందుకు, అక్కున చేర్చుకునేందుకు సందేహిస్తున్నారని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.జగన్ కు పవన్ కు మధ్య స్నేహానికి, భవిష్యత్తు పొత్తుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే వాదనలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని పటాపంచలు చేసేందుకు ఆవిర్భావ సభలో పవన్ యత్నించారనే చెప్పాలి. కేసీఆర్ తో తనకు కుటుంబ సంబంధాలున్నాయన్నారు. అదే విధంగా మోడీ తనను వ్యక్తిగతంగా అభిమానించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడంతో వారితో దోస్తానా కటీఫ్ చేసుకున్నానన్నారు. ఏపీ ప్రజలను, ఆంధ్రప్రదేశ్ ను చిన్న చూపు చూసిన కేసీఆర్ తో, రాష్ట్రాన్ని నష్టపరిచిన మోడీతో సంబంధాల విషయంలో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు పవన్ ప్రత్యేక ప్రస్తావన చేయాల్సి వచ్చింది. జనసేన మీద అనుమానాలు రేకెత్తించడం ద్వారా లబ్ధి పొందాలని అటు టీడీపీ, ఇటు వైసీపీ యోచిస్తున్నాయి. తెలుగుదేశంతో కలిసిపోతారని వైసీపీ ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ ద్వారా జగన్ కు ద్వారాలు తెరుచుకుంటాయని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ రెంటికీ తాము సమదూరం పాటిస్తాం. సొంతంగా నిలుస్తామనే భావన బలంగా ప్రజల్లోకి వెళ్లకపోతే జనసేన దెబ్బతింటుంది. దీనిని దృష్టిలోపెట్టుకునే జనసేనాని వైసీపీ, టీడీపీల ఎత్తుగడలనూ ఎండగట్టే యత్నం చేశారు. మొత్తమ్మీద సభ సక్సెస్ అయ్యింది. అయితే రికార్డు స్థాయి సభగా పరిశీలకులు పేర్కొనడం లేదు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ పార్టీపై భారం పడకుండా స్వచ్ఛందంగా రావడమే ఆ పార్టీకి బలం. బలగం