YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హస్తానికి హ్యాండ్ ఇచ్చి జనసేన గూటికి పరుచూరి

హస్తానికి హ్యాండ్ ఇచ్చి జనసేన గూటికి పరుచూరి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విశాఖ జిల్లాలో జనసేనకు అభ్యర్ధులు ఎక్కడా కనిపించడంలేదు. ఆ పార్టీకి అప్పట్లో కొంత ఊపు ఉన్నపుడు వచ్చిన అరకొర నేతలు కూడా ఇపుడు ఇటు చూడడం మానేశారు. దాంతో మొత్తం పదిహేను సీట్లకు గానూ ఆరింటికి మాత్రమే అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన చోట్ల కొన్ని సీట్లు వామపక్షాలకు ఇచ్చేసి తాను పోటీ చేయాలనుకుంటోంది. అయితే అక్కడ కూడా జనసేన అభ్యర్ధుల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. విశాఖ జిల్లాలో కీలకమైన అనకాపల్లి అసెంబ్లీ సీటుకు ఇపుడు మంత్రి గారు చుట్టం అభ్యర్ధి అవుతారని అంటున్నారు. ఆయనెవరో కాదు గంటా శ్రీనివాసరావుకు సన్నిహిత బంధువు. టీడీపీలో మంత్రికి నీడలా దశాబ్దాల కాలం పాటు పనిచేసిన పరుచూరి భాస్కరరావు ఆ తరువాత విభేదాలు రావడంతో సొంత దుకాణం పెట్టుకున్నారు. అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. దీనికోసం కొద్ది నెలల క్రితం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా చేరిన పరుచూరి అంతలోనే హస్తానికి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పొత్తు ఉంటుందని, ఆ విధంగా టీడీపీ మద్దతుతో ఎమ్మెల్యే అయిపోదామని ఆశపడి హస్తం పార్టీలో చేరిన పరుచూరి చిత్రంగా ఇరుక్కుపోయారు. పొత్తుల్లేవని తేలడంలో ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఒంటరిగా పోటీ చేస్తే వేయి ఓట్లు కూడా రావని బెంగటిల్లిన పరుచూరి ఇపుడు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న పరుచూరి తనకు అనకాపల్లి టికెట్ ఇమ్మని కోరుతున్నారు. దాంతో ఇపుడు జనసేన కూడా ఆయన వైపు మొగ్గుచూపుతోంది. అక్కడ టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నాయి. కనీసం వారికి ఓ మాదిరిగానైనా పోటీ ఇవ్వాలంటే కూడా పరుచూరి లాంటి వారు అవసరం అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నేడో రేపో పరుచూరికి జనసేన కండువా కప్పేందుకు రంగం సిధ్ధం చేస్తున్నారు. పరుచూరి భాస్కరరావు మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆయన మంత్రి గంటాకు అత్యంత సన్నిహితుడు. గంటా అంటే మండిపడే పవన్ పరుచూరిని పార్టీలోకి ఎలా తీసుకుంటారన్న విమర్శలు అపుడే బయల్దేరాయి. నీతి, విలువలు అంటూ ఎన్నో కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం పరుచూరి లాంటి వారిని చేరదీసి టికెట్లు ఇస్తే అది పార్టీ అసలు అస్తిత్వానికే ముప్పు అని కూడా అంటున్నారు. అయితే ఎన్నికల రాజకీయాల్లో ఇదంతా మామూలే అని భావిస్తే మాత్రం పరుచూరి చేరికకు పవన్ ఒకే అంటారని తెలుస్తోంది. పరుచూరి ధనబలానికి జనసేన జనబలం జత కలిస్తే గెలవకపోయినా అనకాపల్లిలో బాగానే పోటీ ఇవ్వగలరని అంటున్నారు. చూడాలి మరి. 

Related Posts