యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తాము సమస్యల్లో ఇరుక్కున్నా ప్రతిపక్షం సమస్యల్లో వున్నా అయోమయం సృష్ట్టించడమే అధికార పార్టీ తారకమంత్రంగా మారిపోయింది. మాజీ ఎంపి వైఎస్ వివేకానంద హత్యకు గురైన తరువాత పరిణామాలను గమనిస్తే టిడిపి అధినేత నుంచి గల్లీస్థాయి వరకు విమర్శల పర్వం ఈ అంశాన్ని చెప్పకనే చెబుతుంది. ఈ ఎపిసోడ్ లో వైసిపికి సానుభూతి లభించే అవకాశాలు వున్నాయనే అనుమానాలతో టిడిపి అలెర్ట్ అయ్యింది. ప్రతిదాడి వ్యూహాలతో నేరుగా విపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఎదురుదాడి మొదలు పెట్టింది. ఇక నేతలంతా వరుసగా రాజకీయ విమర్శలకు క్యూ కట్టి మరీ దిగిపోయారు. ఒకరిపై మరొకరు హత్యారోపణలకు అంతే లేకుండా పోయింది. దాంతో అంతా అయోమయంగా మారిపోయింది. జరిగింది ఏమిటో కూడా ప్రజలకు అర్ధం కాని పరిస్థితి అయిపొయింది.ఆధార్ డేటా చోరీ కేసులో ఇదే తీరు కనిపించింది. ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లోకి బదిలీ అయిపోయింది. అమెజాన్ వంటి అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థల సర్వర్లలో ఎపి, తెలంగాణ ప్రజల డేటా నిక్షిప్తమైంది. దీనికి బాధ్యులు ఎవరు అనేది అందరికి తెలిసినా ఫలితం శూన్యమే అయ్యింది. చట్టాల్లోవున్న లొసుగులను అడ్డం పెట్టుకుని విచారణను సైతం తప్పించుకోవడం నేరుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం వేగంగా జరిగిపోయాయి. ఇక ఎపిలోని అధికార, విపక్షాల సంగతి సరే సరి. దాంతో ఏమి జరిగింది ? ఏమి జరుగుతుందో కూడా ప్రజలకు తెలియకుండా తిరిగి అయోమయం కొనసాగడానికి దారితీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగజారిన రాజకీయాలు సామాన్యుడికి మరింత రోత పుట్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా మారింది.