యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశ అభివృద్ధి, అవినీతిరహిత భారతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతిఒక్కరూ కాపలాదారులేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తన మద్దతుదారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా కార్యకర్తలనుద్దేశించి ఓ సందేశమిచ్చారు. ‘మీ చౌకీదార్ ఇక్కడ నిలబడి దేశం కోసం సేవ చేస్తున్నారు. కానీ నేను ఒంటరి కాదు. అవినీతి, సామాజిక రుగ్మతలు, అపరిశుభ్రతపై పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ చౌకీదారే. దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న వారంతా చౌకీదార్లే. ‘నేను కూడా కాపలాదారునే’ అని నేడు ప్రతి భారతీయుడు సగర్వంగా చెబుతున్నాడు’ అని మోదీ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా పోస్టు చేశారు.ప్రధాని మోదీ చాలా సార్లు తాను ఈ దేశానికి చౌకీదార్‌నని చెప్పుకున్నారు. అయితే ఇదే పదాన్ని ఉపయోగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానిపై పలుసార్లు విమర్శలు చేశారు. రఫేల్ వివాదంపై మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన రాహుల్.. చౌకీదారే దొంగ అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు భాజపా కూడా దీటుగానే బదులిస్తూ వస్తోంది.