యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల ముందు వైకాపా నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఎంతో సౌమ్యుడైన వివేక మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. తెదేపా, చంద్రబాబుకు ఆపాదించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం అవివేకమని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. తెల్లవారుజామున బాత్రూం వద్ద రక్తం మడుగులో పడి ఉన్న వివేకానంద రెడ్డిని పడకగది వద్దకు ఎవరు తరలించారు. ఉదయమే వివేక గుండెపోటుతో మరణించారని అన్ని ఛానళ్లకు సమాచారం ఇచ్చింది వాళ్లు కాదా. గాయాలు, రక్తపు మడుగులో ఉన్న శవాన్ని పోలీసులకు తెలియచేయకుండా ఒక చోటి నుంచి మరో చోటికి తరలించింది వారేనని అయన అన్నారు. మధ్యాహ్నానికే క్లైమాక్స్ మార్చి హత్య చేశారని చెప్పింది వారే. మీడియా కూడా ఈ అనుమానాలపై లోతుగా ఆలోచించాలి. ప్రతిపక్ష నేతగా ఉండి చిన్నాయన మృతి మృతి చెందితే సాయంత్రం వరకు ఎందుకు స్పందించలేదు. ఇప్పుడు సిబిఐ విచారణ కావాలంటున్నాడు. అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు సిబిఐ అవసరం లేదన్న జగన్ ఇప్పుడు సిబిఐ కావాలనడం విడ్డూరంగా ఉంది. అంటే జగన్ రెడ్డి సిబిఐ, జగన్మోహన్ రెడ్డి సిబిఐలు రెండు ఉంటాయా. కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఇబ్బంది పెట్టేందుకే గవర్నర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తానంటున్నాడని అయన అన్నారు. వివేక హత్య వెనుక ఎవరు ఉన్న కఠినంగా శిక్షించాల్సిందే. తాను తప్పు చేసి ఉంటే గల్ఫ్ దేశాల్లో బహిరంగంగా ఎలా శిక్షిస్తారో అలాంటి శిక్ష కు సిద్ధమే. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త పోరాడాలి. జమ్మలమడుగులో రామ సుబ్బారెడ్డి, నేను ఎలా కలిసిపోయామో అలా రాయచోటి లో కూడా ప్రసాద్ బాబు, రమేష్ రెడ్డి వర్గీయులు కలిసిపోయి అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సిందేనని అన్నారు.