యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక పత్యేక జనరల్ బాడీ సమావేశం ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు తెలిపారు. విజయవాడ నగరానికి సమీపంలోని కానూరు సిద్ధార్ధా ఇంజనీరింగ్ కళాశాల(మహానాడు జరిగిన ప్రదేశం)లో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుఅవుతారని చెప్పారు. విజయవాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల అభ్యర్ధులు టిడిపి నిబంధనలకు అనుగుణంగా ప్రమాణం చేస్తారని, అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందేశం ఇవ్వనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రలు, ఇతర అతి ముఖ్యనాయకులు హాజరు కావాలని కోరారు. జిల్లా నుంచి 35 వేల మంది నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ వేదిక నుంచి ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకుల అనుసంధించాల్సిన విధివిధానాలపై సిఎం చంద్రబాబునాయుడు దిశానిర్ధేశం చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో టిడిపికి సాటి మరోపార్టీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు టిడిపికి తప్ప ఇతర పార్టీలకు లేదన్నారు. వైసిపి డబ్బులు ఇచ్చిన వారికే సీట్లు కేటాయిస్తుందని, వైసిపి ప్రతిపక్ష పార్టీగా వైసిపి విశ్వాసం కోల్పోయిందన్నారు. పట్టిసీమ దండగన్న పార్టీ వైసిపి అన్నారు. అదే పట్టిసీమతో టిడిపి ప్రభుత్వం గత మూడేళ్లలో డెల్టా పరిధిలో రూ.50 వేల కోట్ల విలువైన పంటను కాపాడినట్లు చెప్పారు. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు నీటి బధ్రత కల్పించినట్లు చెప్పారు. చివరికి ప్రతిపక్షనాయకుడి ప్రాంతమైన పులివెందులకు నీరిచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకంలో వృద్దులు, వితంతువులు, వికలాంగులు ఇస్తున్న పింఛన్లను రెట్టింపు చేశారని భవిష్యత్తులో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగైతే మరింత పెంచే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆడపడుచులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఎటువంటి హామీ లేకుండా రూ.1 లక్ష నుంచి 15 లక్షల వరకూ రుణాలు మంజూరు చేస్తున్నారని, పసుపు-కుంకుమలో భాగంగా రూ.10 వేలు రుణమాఫీ, మరో రూ.10 వేలు అధనంగా చెల్లించడం జరిగిందన్నారు. ఈ పథకంలో 97 లక్షల మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.10 వేలు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు అన్నధాత సుఖీభవ పథకం కింద రూ.15 వేలు పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 130 సంక్షేమ పథకాలను పేదప్రజల కోసం అమలు చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ఏడాది జూన్ నాటికి గ్రావిటితో నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటుందని, ఇప్పటి వరకూ 33 వేల కిలో మీటర్ల సిమెంట్ రోడ్లను పూర్తి చేసిందన్నారు. తాగునీరు సౌకర్యం కల్పించిందన్నారు. ఎల్ఇడి కాంతుల వెలుగుతో గ్రామీణ ప్రాంతాలు వెలిగిపోతున్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు, బిసిలకు సబ్ ప్లాన్ అమలు చేస్తూ వారికి కేటాయించిన నిధులను వారికే వినియోగిస్తుందన్నారు. బిసిలకు 26 కార్పోరేషన్లు, ఫెడరేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు, ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతిని నెలకు రూ.2 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. యువతకు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం, పక్క రాష్ట్రంలోని పనికిమాలిన టిఆర్ఎస్, కేంద్రంలోని బిజెపి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. వైసిపికి ఒక్క ఓటు వేసినా అది కేంద్రంలోని బిజెపికి వేసినట్లవుతుందన్నారు. విభనజలో భాగంగా పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన ఆస్తులను పంచకుండా కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో 21 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని కోరారు. టిడిపి ఎవరికి మద్దతు ఇస్తే వారే ప్రధాని అయితే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 16 శాసనసభ, 2 పార్లమెంట్ స్థానాల్లో టిడిపి విజయం సాధిస్తుందని చెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ లుక్కా సాయిరామ్ గౌడ్ మాట్లాడుతూ టిడిపి తొలివిడత జాబితాలో 126 స్థానాలకు 32 స్థానాలు బిసిలకు కేటాయించిందన్నారు. 25 శాతం బిసిలకు ప్రాధాన్యత దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిసిలు చంద్రబాబుకు మద్దతు పలకాలని కోరారు. విలేకర్ల సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ బండారు హనుమంతరావు, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పాల్గొన్నారు.పాల్గొన్నారు.