యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటక రాష్ట్రంలో సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చేలా లేదు. రోజులు గడిచే కొద్దీ రెండు పార్టీల మధ్య మరింత పట్టు బిగుస్తోంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నేతలు ఎవరికి వారే మొండి పట్టుదలకు పోతున్నారు. అయితే ఇందులో జనతాదళ్ ది కూడా కొంత తప్పే అవుతుంది. ఎందుకంటే జనతాదళ్ ఎస్ తాము ముఖ్యమంత్రి పదవిలో ఉన్నామని ఎక్కువ స్థానాలను కోరుకుంటోంది. దానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇప్పటి వరకూ ఐదుసార్లు రాష్ట్రంలో, రెండు సార్లు ఢిల్లీలో సీట్ల పంచాయతీ జరిగింది. జనతాదళ్ ఎస్ కు ఎనిమిది, కాంగ్రెస్ 20 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొంత దిగివచ్చినా జేడీఎస్ కోరుతున్న స్థానాలు సమంజసంగా లేవన్నది ఆ పార్టీ నుంచి విన్పిస్తున్న మాట. కేవలం 38 స్థానాలు వచ్చిన జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఉప ముఖ్యమంత్రి పదవితో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. అధిష్టానం మాట కాదనలేక, బీజేపీని అధికారంలోకి రాకుండా ఉంచేందుకే కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సయితం అంగీకరించారు. అయితే లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి మరీ జేడీఎస్ పంతానికి పోతుండటం కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కేవలం రెండు స్థానాలే వచ్చాయి. ఆ స్థానాలు అడిగితే కొంతవరకూ పరవాలేదు. అది కాకుంటా మరో ఎనిమిది స్థానాలు కావాలని గట్టిగా కోరుతోంది. చివరకు జేడీఎస్ అడిగిన స్థానాలను ఇవ్వకతప్పింది కాడు.మాజీ ప్రధాని దేవెగౌడ పట్టుబడుతున్న స్థానాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తుండటం వారికి మింగుడు పడటం లేదు. జనతాదళ్ ఎస్ తుమకూరు, రాయచూరు, చిక్ బళ్లాపుర, కోలారు స్థానాలను కోరుకుంటుంది. చిక్క బళ్లాపుర నుంచి మాజీ కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనను మార్చే పరిస్థితి లేదు. అలాగే కోలారు స్థానం నుంచి మాజీ కేంద్ర మంత్రి మునియప్ప కొన్ని దశాబ్దాలుగా అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఆయనను కదిపే సాహసం కాంగ్రెస్ అధిష్టానం కూడా చేయదు. తుముకూరులో కూడా పార్టీ సీనియర్ నేత హనుమే గౌడ స్థానాన్ని కూడా కోరుకోవడాన్ని కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.ఢిల్లీలో దేవెగౌడ పంచాయతీ పెట్టినా సరే ఈ సీట్లను ఇచ్చేందుకు రాహుల్ గాంధీ సయితం అంగీకరించరని తెలిసినా పట్టుబట్టడం వెనక ఆంతర్యమేమిటన్నఆరా తీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో సీట్ల పంపకంపై చిక్కుముడి పట్టినట్లేనని చెబుతున్నారు. ఆరు నుంచి ఎనిమిది సీట్లు అదీ జేడీఎస్ కోరుకున్నవి కాకుండా తాము ఇచ్చే సీట్లు తీసుకోవాలన్నది కాంగ్రెస్ సంకేతాలను అప్పటికే పంపింది. ఈ సంకేతాల పట్ల దేవెగౌడ సయితం ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. దేవెగౌడ తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మనవళ్లిద్దరినీ బరిలోకి దింపుతున్నారు. దేవెగౌడ సీట్ల పంపకంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో రెండు పార్టీల క్యాడర్ ఒకరికొకరు సహకరించుకుంటుందా? అన్న సందేహం కలుగుతోంది. మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం జరిగినా కలిసి పనిచేసే వాతావరణం లేదన్నది సుస్పష్టం.