YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆశ నిరాశ

 ఆశ నిరాశ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
 

శ్రీకాకుళం : ఖరీఫ్‌ సీజన్‌లో వచ్చి తిత్లీ తుపానుతో నియోజకవర్గంలోని వరి పంట మొత్తం నాశనమైంది. రైతులకు ఖరీఫ్‌ వరి పంట పెట్టుబడి కూడా మిగల్లేదు. రబీ సీజన్లో అపరాల పంటలపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఈ ఏడాది అపరాల విస్తీర్ణం పెరిగినప్పటకీ వరుణుడు కరుణించకపోవడం, చీడపీడలు అధికం అవ్వడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ధర కూడా తక్కువగా ఉండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధర మాత్రం అపరాల పంట పండించే రైతులకు అందడంలేదు. నియోజకవర్గంలో సుమారు 8 వేల ఎకరాల్లో రబీ సీజన్‌లో అపరాల పంటను సాగు చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై సరఫరా చేసిన విత్తనాలను కొనుగోలు చేసి పండించారు. పంట చేతికందక ముందు ధరలు విపరీతంగా పెంచి, పంట చేతికందే సమయానికి గిట్టు బాటు ధర లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం విత్తనాలు వేసిన నాటి నుంచి వర్షాలు లేవు. వాతావరణం అనుకూలించక పోవడంతో పంటకు చీడపీడలు ఆశించి దిగుబడులు కూడా రాలేదు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకటనలకే  పరిమితమవుతోంది. మద్దతు ధరకు బయట మార్కెట్‌ ధరలకు పొంతన ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతు ధర   రైతులకు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. బయట మార్కెట్‌లో 100 కిలోల పెసల ధర రూ.5 వేలు, మినుములు బస్తా రూ.3200లకు  కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెసలు వంద కిలోలకు రూ.7 వేలు, మినుములు వంద కిలోలకు రూ.5,600 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెసలు, మినుములు కొనుగోలు చేయడంలేదు.

అపరాల పంట ఎకరాకు కనీసం 4 నుంచి 5 వందల కిలోల దిగుబడులు వస్తుండేవి. ఈ సంవత్సరం అందులో సగం కూడా రాని పరిస్థితి. పంటకు అనుకూలించక పోవడంతో రెండు నుంచి మూడు సార్లు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. విత్తనాల పెట్టుబడి, పంట తీయడానికి, నూర్పుడిలు చేయడానికి ఎకరానికి సుమారు రూ.8 వేలవరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. కనీస దిగుబడులు కూడా రాకపోవడంతో మినుము, పెసర పంటను తీయకుండా ఆవులకు మేతగా చాలా చోట్ల  విడిచిపెడుతున్నారు.ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts