YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అడుగంటిపోతున్నాయ్..

అడుగంటిపోతున్నాయ్..

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
 

నెల్లూరు: జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మెట్ట మండలాల్లో గుక్కెడు నీటి కోసం గ్రామీణ జనం కన్నీటి కష్టాలను అనుభవిస్తున్నారు. గొంతు తడుపుకొనేందుకు దోసెడు నీరు దొరక్క ప్రత్యామ్నాయ మార్గం కనిపించక కకావికలమై పోతున్నారు. జిల్లాపై కరవు మేఘం కమ్మేసి లోటు వర్షపాతం నమోదు కావడంతోపాటు ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతాల్లో గత నాలుగేళ్లుగా సరైన వర్షాల్లేక భూగర్భజలం పాతాళానికి చేరింది. వందల అడుగులు బోర్లు వేసి గుక్కెడు జలం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యమే. బోర్ల కోసం రూ.లక్షలు ఖర్చయిపోతున్నా జలం జాడ లేదు. ప్రభుత్వం, దాతలు ట్యాంకర్ల ద్వారా నీళ్లను పంపిణీ చేస్తున్నా ప్రజల అవసరాలు తీరటంలేదు. గత్యంతరంలేక కొందరు ఇళ్లను ఖాళీచేసి వలసబాట పడుతుండగా ప్రత్యామ్నాయం లేనివారు కన్నీళ్లు దిగమింగుతున్నారు.

ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీలో ఉండే నీటి పథకాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ట్యాంకర్లతో సరఫరాచేసే నీరు ప్రజలకు పూర్తిగా చాలడం లేదు. నాలుగు రోజుల క్రితం ట్యాంకరు ఆగిపోగా, జనం ఆగ్రహించడంతో చివరకు అధికారులు కంటి తుడుపుగా ట్యాంకర్లను పంపించారు. ఉదయగిరి మేజరు పంచాయతీలో 2,200 కుటుంబాలుండగా 14,240 మంది జనాభా ఉన్నారు. పంచాయతీ పరిధిలో ఐదు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, మూడు అండర్‌గ్రౌండ్‌ ట్యాంకులు, 11 సింథటిక్‌ ట్యాంకులుండగా నీటి సరఫరాకు సంబంధించి 24 బోర్లు ఉన్నాయి. బోర్లలో నీరులేక ప్రజలు తీవ్రమైన నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ద్వారా రెండు ట్యాంకర్లతోపాటు దాతల ద్వారా ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నా ఏమూలకూ సరిపోక ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బిందెడు నీటి కోసం జనం కన్నీటి వ్యథను అనుభవిస్తున్నారు. దుత్తలూరు మండలంలో సుమారు 10 గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతుంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపశమనం లేదు.

జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి నియోజవర్గాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి సమస్య జఠిలంగా మారింది. ప్రత్యామ్నాయ మార్గంలేక చేసేదేమీలేక పల్లె జనం పశువులను సైతం తెగనమ్మేసి పట్టణ ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ఇటీవల ఉదయగిరి, సీతారామపురం మండలాల్లోని ఎన్నో గ్రామాలు సగం ఖాళీ అయిపోయిన పరిస్థితి ఉంది. 

జిల్లాలో 14 మండలాల్లోని 73 గ్రామాల్లో అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో గతేడాది జూన్‌ నుంచి ట్యాంకర్లుపెట్టారు. గతేడాది జూన్‌ నుంచి డిసెంబరు వరకు ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించి జిల్లాకు రూ. 4.85 కోట్లు మంజూరు అవగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు బిల్లులు చేసి ఖజానా కార్యాలయాలకు పంపారు. నిధులు మంజూరుకు ఫ్రీజింగ్‌ ఉండటంతో సరఫరాదారులకు బిల్లులు అందక ట్యాంకర్లు నిలిపేస్తున్నారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో నీటి పథకాల బోర్లు పడకేశాయి. చేతిపంపులు చతికలబడి దర్శనమిస్తున్నాయి. ఎటువైపు చూసినా నీటి జాడలేకుండా దారులు మూసుకుపోయాయి. మరో వైపు వేసవి ప్రారంభమై ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. తాగేందుకు, ఇళ్లలో అవసరాలకు నీరు లేక ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. నీటిశుద్ధి కేంద్రాల వద్ద వృథాగా పోయే నీటిని కూడా వాడుకొనే జనం పట్టుకొని వెళుతున్నారంటే ఎంత దయనీంగా ఉందో వేరేగా చెప్పనక్కర్లేదు. గ్రామీణ ప్రాంతంలో ఏగడపకెళ్లినా నీటి కష్టం చెప్పనివారు లేరంటే అతియోశక్తి కాదు. . రాత్రి పగలు బిందె నీళ్ల ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. బిందెడు అప్పుగా తీసుకొని కాలం గడిపేయాల్సిన పరిస్థితులు వెంటాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేరస్తున్నారు.

Related Posts