Highlights
- సీఈఓగా కేశవరావు
- ఏపీ రాష్ట్రప్రభుత్వం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మనటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానళ్ల నిర్వహణ నిమిత్తం ఛైర్మన్, సీఈఓలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ గా ఇనగంటి అనిల్, సీఈఓగా బి. కేశవరావులను ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని వెలువరించింది. మీడియా రంగంలో దశాబ్దంపైగా అనుభవం ఉన్న అనిల్, గతంలో మహాటీవీ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఇరవైయేళ్లుగా టీవీ జర్నలిజంలో విశేష కృషి చేసిన కేశవ్, ఎలక్ట్రానిక్ మీడియాలో భాష గురించి పలు పుస్తకాలు రాశారు. దూరవిద్య, గ్రామీణ అభివృద్ధి, టెలిమెడిసిన్, డిజిటల్ ఎడ్యుకేషన్ వ్యాప్తి కోసం మనటీవీ ఛానళ్లు ప్రసారాల్ని రూపొందిస్తాయి. మనటీవీ నెట్ వర్క్ ని శాప్ నెట్ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మనటీవీని తెలంగాణా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. అమరావతి కేంద్రంగా మనటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రసారాలని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)ని అమల్లోకి తేవడంతో ప్రభుత్వ సేవలు, దూరవిద్య, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు శాప్ నెట్ విశేషంగా కృషిచేయనుంది.