Highlights
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కన్నా లక్ష్మీనారాయణ… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? పోటీ చేస్తే కన్నా నెగ్గుకొస్తారా? బీజేపీ ఖాతాలో ఒక స్థానాన్నయినా చేరుస్తారా? ఆయనకున్న బలాబలాలేంటి? బలహీనతలేంటి? ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఇదే. కన్నాలక్ష్మీనారాయణ శాసనసభ నుంచి పోటీ చేయనున్నారు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత జరుగున్న తొలి ఎన్నికలు ఇవే. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు మాట ఎలా ఉన్నా కన్నా పోటీ చేసే నియోజకవర్గంపైనే కమలం పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.కన్నా లక్ష్మీనారాయణ బలమైన నేత. అందులో ఏమాత్రం సందేహం లేదు. మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు బలమైన సామాజిక వర్గంతో పాటు వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉండటం అదనపు బలం. ఆయన గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? లేక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. పెదకూరపాడు నియోజకవర్గం కన్నాకు కొత్తేమీ కాదు.కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరసగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 2009లో మారారు. అక్కడి నుంచి కూడా ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.ఇప్పుడు కన్నా పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా ఉంటుందన్నది పార్టీ నేతల అభిప్రాయం. పెదకూరపాడులో వరసగా రెండు సార్లు విజయం సాధించి ఊపు మీదున్న టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. ఆయన హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అభ్యర్థి ఇంకా ఇక్కడ డిసైడ్ కాలేదు. మొన్నటి వరకూ ఇక్కడ ఇన్ ఛార్జిగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండకు వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కావటి మనోహర్ నాయుడిని నియమించారు. ఆయనను కూడా మార్చాలన్న ఉద్దేశ్యంతో అధినేత జగన్ ఉన్నారు. అయితే సామాజిక పరంగా చూస్తే కొంత కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో కన్నా ఇక్కడ పోటీ చేస్తారా? అన్న అనుమానాలు లేకపోలేదు.ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కన్నాకు కొంత కలసి వచ్చే ప్రాంతంగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతం కావడంతో కమలం పార్టీకి కొంత అనుకూలంగా ఉందని అంటున్నారు. మొన్నటివరకూ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలోకి వెళ్లారు. ఆయన ఎంపీగా పోటీ చేయనున్నారు. వైసీపీ ఇన్ ఛార్జిగాచంద్రగిరి ఏసురత్నం ఉన్నారు. ఇక్కడ ఇన్ ఛార్జిగాఉన్న లేళ్ల అప్పిరెడ్డిని వైసీపీ తప్పించింది. తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారుచేయలేదు. అయితే ఇక్కడ కన్నాకు గెలుపు ఈజీగా ఉంటుందన్నది కమలం పార్టీ అంచనా వేస్తోంది. కన్నా ఆలోచన కూడా వెస్ట్ నియోజకవర్గంపైనే ఉంది. మరి వెస్ట్ నుంచి పోటీ చేసి కన్నా గెలుస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే కొంత స్కోప్ ఉన్న నియోజకవర్గం ఇదే కన్పిస్తుంది.