యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నామినేషన్ తేదీ దగ్గరపడుతున్నా కొద్ది విజయవాడ రాజకీయం కాక మీదకు వస్తోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా..వైసీపీలో ముందనుకున్న అభ్యర్థిత్వాల్లో కొన్నింట్లో మార్పులు చేర్పులతో ముందుకు వెళుతుంది. పీవీపీ వైసీపీలో చేరడంతో వైసీపీలో సీన్ మారుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎంపీ స్థానానికి మొదట జై రమేష్‌ను ఖాయం చేసుకున్నప్పటికి ఆ తర్వాత ప్రసాద్ వి.పొట్లూరి వచ్చిచేరడంతో ఆయన పేరు అనుహ్యంగా తెరమీదకు వస్తోంది. అంతేకాదు 23న నామినేషన్ వేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సమన్వయకర్త యలమంచిలిరవి పేరు మొదట్నుంచి వినిపించింది. ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకే టికెట్ అన్నంతగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని ముందుండి నపిస్తున్నారు.అయితే పీవీపీ చేరికతో యలమంచిలికి కాకుండా కార్పొరేటర్ బొప్పన భవకుమార్ పేరు వినబడుతోంది. యలమంచిలికి కాకుండా భవకుమార్‌కు టికెట్ ఇవ్వాలని పీవీపీ అధిష్ఠానానికి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మాట తీసేయలేక అలాగే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మలమంచిలి రవి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు.2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ ఓడిపోయాక తూర్పు బాధ్యతలను భవకుమార్‌కు అప్పగించింది. ఆ తర్వాత రవిని ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడేమో భవకుమార్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండటంతో వైసీపీలో కొంత అయోమయం నెలకొంది.వాస్తవానికి భవకుమార్‌కు పీవీపీకి మంచి సంబధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. అదే జరిగితే యలమంచిలి ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, పశ్చిమం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్లు వినబడుతున్నాయి. మరోవైపు వైసీపీ నుంచి బయటకి వచ్చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరిపోయారు. ఆయన మంచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక విజయవాడ సెంట్రల్ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా ఆదినారాయణ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జనసేన, సీపీఎం, సీపీఐ పొత్తు అభ్యర్థిగా బాబురావు బరిలో నిలుస్తున్నట్లు సమాచారం. పశ్చిమ నుంచి కూడా వామపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసే అవకాశం కనబడుతోంది. అయితే జనసేనతో పొత్తు ఉన్నా లేకపోయినా తాము బరిలో ఉంటామని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా విజయవాడ రాజకీయం సలసలమంటూ కాగుతోంది.