Highlights
- టీ20ల్లో తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు..?
- టీ20లో మరో క్యాచ్ అందుకుంటే 50 క్యాచ్‌లతో
- మొదటి వికెట్ కీపర్‌గా ధోని రికార్డు..?
దక్షిణాఫ్రికాతో ఈ సాయంత్రం మ్యాచ్‌లో కోహ్లి మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 2000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిల్వనున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లికి ఇదేమంత పెద్ద విషయం కాదని అలవోకగా మైలురాయిని చేరుకుంటాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. టీ20ల్లో ఇప్పటివరకూ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే 2వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు. వారిద్దరూ న్యూజిలాండ్‌కు చెందిన వారు కావడం గమనార్హం. మార్టిన్ గప్తిల్ 75 మ్యాచ్‌ల్లో 34.40 సగటుతో 2,271 పరుగులు సాధించగా, బ్రెండన్ మెక్‌కల్లమ్ 71 మ్యాచ్‌ల్లో 35.66 సగటుతో 2,140 పరుగులు సాధించాడు. ఇప్పుడు కోహ్లి కనుక దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టీ20లో 17 పరుగులు చేస్తే 2వేల పరుగుల మైలురాయి చేరిన మూడో ఆటగాడు అవుతాడు. ప్రస్తుతం కోహ్లి 57 టీ20ల్లో 50.85 సగటుతో 1,983 పరుగులు సాధించాడు. ఇద్దరు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు టీ20ల్లో రెండేసి శతకాలు చేయగా, కోహ్లికి ఇంకా ఆ అవకాశం ఇంకా రాలేదు. కోహ్లి ఇప్పటివరకూ 18 అర్ధశతకాలు మాత్రమే చేశాడు.
మరోపక్క టీమ్ ఇండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ధోని కూడా మరో రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు కేప్‌టౌన్ వేదిక కానుంది. ఇప్పటికే పలు మైలురాళ్లు అందుకున్న ధోని అంతర్జాతీయ టీ20ల్లో వికెట్‌కీపర్‌గా 49 క్యాచ్‌లను అందుకున్నాడు. ఈ రాత్రి జరిగే టీ20లో మరో క్యాచ్ అందుకుంటే 50 క్యాచ్‌లు అందుకున్న మొదటి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 32 క్యాచ్‌లు అందుకుని వెస్టిండీస్ వికెట్ కీపర్ రామ్‌దిన్ ధోని తర్వాతి స్థానంలో ఉండగా, మూడో స్థానంలో 30 క్యాచ్‌లో దక్షిణాఫ్రికా కీపర్ డికాక్ మూడో స్థానంలో నిలిచారు.