యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భానుడు భగభగ మంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గొంతెండిపోతోంది. ప్రజలు ఉక్కపోతకు తట్టుకోలేక ఉపశమనం కోసం పరుగులు తీస్తున్నారు. దాహార్తిని తీర్చుకునేందుకు చెరుకు, పండ్ల రసాలు, మజ్జిగ ఇతర పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ సెంటర్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా ఎక్కడపడితే జ్యూస్, చెరుకు రసం దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వేసవి వచ్చిందంటే పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెరుకు, పండ్ల రసాలు, లస్సీ, మజ్జిగ తదితర పానీయాలను విక్రయించే దుకాణాలు వెలుస్తాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఇలాంటి దుకాణాలు 200పైగా ఉంటాయి. ఎండ కాలంలో బయటకు వచ్చే పట్టణ వాసులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కనీసం 20నుంచి 30శాతం మంది ఎక్కడో ఓ చోట కచ్చింతంగా చల్లని పానీయాన్ని పుచ్చుకుంటున్నారు. కొందరు వ్యాపారుల్లో అవగాహన లేక పానీయాల్లో చల్లదనం కోసం అపరిశుభ్ర వాతావరణంలో, కలుషిత నీటితో తయారు చేసిన ఐస్‌ను వినియోగిస్తున్నారు. అందుకే వేసవిలో ఆస్పత్రుల బాటపటే పట్టణ వాసుల సంఖ్య సుమారు 5శాతం పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.ఈ సీజన్‌లో ఇది సహాజమే అయినా.. చాలా మంది చల్లదనం కోసం లేనిదే ఆ పానీయాలను ముట్టుకోరు. ఇంకొందరైతే అడిగి మరీ మరిన్ని ఐస్ గడ్డలు వేయించుకుంటారు. ఎలాంటి అనుమతులు లేకుండా, శుభ్రత పాటించకుండా ఈ కేంద్రాల్లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్‌తో లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాస్తవానికి పండ్ల రసాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఆయా పండ్ల రసాల్లో కలిపే ఐస్ అనారోగ్యానికి దారితీస్తోంది. జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు అపరిశుభ్రత నీటితో ఐస్ తయారీ చేసి విక్రయిస్తున్నారు. ఐస్‌లో అనేక రకాల బాక్టీరియా, క్రీముల ఉంటాయి. అవి పండ్ల రసాల్లో కలిసిపోయి జ్యూస్ ద్వారా శరీరంలోకి చేరి అనారోగ్యం కల్గిస్తాయి.కొందరు వ్యాపారులు పండ్లను నిల్వ చేసి వాటితో జ్యూస్‌లను తయారుచేస్తున్నారు. వాటిలో వాడిపోయినవి, కుళ్లిపోయినవి ఉంటున్నాయి. వాస్తవానికి తాజా పండ్లతో అప్పటికప్పుడు రసం తయారు చేసి ఇవ్వాలి. అయితే చాలా మంది రెండు మూడు రోజులకు ఒకేసారి పెద్దమొత్తంలో రసాలు తయారుచేసి డ్రమ్ములలో నిల్వ ఉంచుతున్నారు. మరికొందరు వ్యాపారులు పండ్ల రసాల పేరుతో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. ఐస్‌క్రీంలు, లస్సీల్లో వీటి వాడకం అధికం ఉంది.సాధారణంగా ఐస్‌ను చూడగానే ఇది మంచి నీటి తో తయారైందా లేదా అన్న విషయాన్ని మనమే కాదు.. నిపుణులు సైతం అప్పటికప్పుడు గుర్తించలేరు. ప్రస్తుతం మార్కెట్‌లో పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఐస్‌తో పాటు ఎడిబుల్ రకం అందుబాటులో ఉంది. మొదటి రకాన్ని చేప లు, మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు.. పండ్లు, ఇతర వస్తువులను ఎగుమతి చేసేందుకు.. ఆస్పత్రుల్లో శవాలను భద్రపరిచే మార్చురీల్లో వినియోగిస్తారు. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో పెద్ద క్యూబ్ రూ.30నుంచి రూ. 50 వరకు లభిస్తుంది.ఈ రకం ఐస్ తయారీ మం చి నీటితో, పరిశుభ్ర వాతావరణంలోనే చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. ఇక ఎడిబుల్ విషయానికొస్తే ఖచ్చితంగా నియామాలను పాటించాలి. మం చి నీటినే వినియోగించాలి. కాకపోతే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో క్యూబ్ రూ. 100 నుంచి 150వరకు లభిస్తుంది. శీతల పానీయాల్లో ఎడిబుల్ ఐస్‌ను వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలా మంది చిరు వ్యాపారులు ఖర్చు తగ్గించుకునేందుకు మొదటి రకం ఐస్‌ను వినియోగించేందుకే మొగ్గు చూపుతున్నారు.