యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రతి కుటుంబం, ప్రతి మనిషికి మంచి జరగాలి. అదే నా లక్ష్యం. ఆ దిశలోనే ఎన్నికల ప్రణాళిక. పాదయాత్రలో అందరినీ చూశాను. ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకున్నాను. బాధలన్నీ స్వయంగా విన్నానని ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.
చంద్రబాబుది మోసపూరిత పాలన అన్న ఆయన, ఒక గజదొంగలా, బందిపోటులా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు దేనికైనా వెనుకాడడం లేదని, చివరకు హత్యా రాజకీయాలకు సైతం తెర లేపుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో సోమవారం మధ్యాహ్నం జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. రాయలసీమలో ఇది తొలి సభ .ప్రజలందరూ బాగుండాలని, ప్రతి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్న సంకల్పంతోనే రాష్ట్రంలో సుదీర్ఘంగా 3648 కి.మీ పాదయాత్ర చేశానని, ఆ యాత్రలో అందరి గుండె చప్పుడు విన్నానని, ప్రజల కష్టాలు స్వయంగా చూశానని, వారి మాటలు విన్నానని జగన్ తెలిపారు.
‘నేనున్నాను’ అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబం, ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) విడుదల చేయనున్నట్లు జగన్ వెల్లడించారు. ఒక ఊరు, ఒక కుటుంబం ఏం కోరుకుంటోంది అన్నది తాను యాత్రలో తెలుసుకున్నానని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. నిజానికి ప్రభుత్వానికి మనసుంటే ఆ పని చేస్తుందని.. కానీ చంద్రబాబుకు అది లేదని.. మహానేత వైయస్సార్ పాలనతోనే అలాంటి ప్రభుత్వం పోయిందని చెప్పారు. ఒక గ్రామమే తీసుకుంటే, ఒక కుటుంబాన్ని తీసుకుంటే.. ఆ గ్రామం, ఆ కుటుంబం బాగు పడాలంటే ఏం చేయాలన్నది ఈ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా ఎక్కడా కనిపించలేదని అన్నారు. గ్రామాల్లో ప్రజలందరి ఆవేదన విన్నానని, బాధలు చూశానని, కాబట్టే ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇస్తున్నానని అయన వెల్లడించారు.
‘రాష్ట్రంలో దాదాపు 50 శాతం అక్కాచెల్లెమ్మలు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటన్నది చూశాను. దాదాపు 93 లక్షల కుటుంబాలు పొదుపు సంఘాలలో ఉన్నాయి. వారి పరిస్థితి ఏమిటన్నది స్వయంగా చూశాను. నిజానికి వారు సంతోషంగా ఉంటే వారి కుటుంబాలు, గ్రామాలు.. చివరకు రాష్ట్రం బాగుంటుంది. పాదయాత్రలో వారి కష్టాలు చూశాను. వారి అప్పులు మాఫీ కాలేదు. వడ్డీలు పెరిగాయి. చివరకు సున్నా వడ్డీ రుణాల జాడే లేదు. వారి బాధలన్నీ నేను విన్నాను. అందుకే భరోసా ఇస్తున్నానని అన్నారు.
‘ఆడపిల్లలకు భద్రత ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నేను పాదయాత్రలో గమనించాను. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. దీంతో గ్రామాల్లో మహిళలకు భద్రత లేకుండా పోయింది. అందుకే నేను చెబుతున్నాను. భరోసా ఇస్తున్నాను. అదే ‘నేనున్నాను’. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్
‘పేద విద్యార్థులు ఫీజులు కట్టలేకపోతున్నారు. ఇంజనీరింగ్ ఫీజు లక్ష రూపాయలు దాటినా ప్రభుత్వం ముష్టిగా రూ.35 వేల వరకే ఇస్తోంది. దీంతో మిగిలిన ఫీజు చెల్లించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీ కష్టాలు చూశా. మీ బాధలు విన్నా. అందుకే మీ అందరికీ భరోసా ఇస్తున్నానని అన్నారు. ‘పాదయాత్రలో ఇంకా నిరుద్యోగులను చూశాను. యువత బాధలూ చూశాను. రాష్ట్రంలో దాదాపు 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ లేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏదీ నిలబెట్టుకోలేదు. నిరుద్యోగులకు భృతి కూడా ఇవ్వలేదు. అందుకే అందరి కష్టాలు చూశానని అన్నారు. ‘ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారు. 108 సర్వీసులూ నడవడం లేదు. దీంతో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంకా చాలా మంది రోగులను చూశాను. ఆ కుటుంబాల వేదన చూశాను. మీ అందరికీ చెబుతున్నాను. ఒక భరోసా ఇస్తున్నానని అన్నారు. జాబితాలో నుంచి ఓట్లు తొలగిస్తున్నారని, దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని, ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రైవేటు సంస్థకు ఇచ్చారన్న జననేత, గెలుపు కోసం చివరకు హత్యా రాజకీయాలకు కూడా చంద్రబాబు తెర లేపుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అన్యాయాలు మరింత పెరుగుతాయని, గ్రామాలకు మూటుల, మూటల డబ్బు పంపిస్తాడని, ఒక్కో ఓటుకు రూ.3 వేలు ఇస్తాడని ఆరోపించారు. పాణ్యం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటసాని రామభూపాల్రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పి.బ్రహ్మానందరెడ్డిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు