యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు 2 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా పాలనాధికారి, పెద్దపల్లి పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించు పార్లమెంట్ ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్ సోమవారం విడుదల అయిందని, పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయని, అందులో ధర్మపురి, రామగుండం, పెద్దపల్లిలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎర్పాట్లు చేయడం జరిగిందని, మార్చి 18,2019 నుంచి మార్చి 25,2019 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తున్నామని, మార్చి 26న నామినేషన్లను పరిశిలిస్తామని, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28,2019 గడువు అని తెలిపారు. మొదటి రోజు సోమవారం రెండు నామినేషన్లు స్వికరించామని, రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన కోయ్యాడ స్వామి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరియు మంచిర్యాల జిల్లాకు చెందిన తాడెం రాజ్ ప్రకాశ్ ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, నామినేషన్ ప్రక్రియ అనంతరం కలెక్టర్ అబ్యర్థుల చే ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. నామినేషన్లను కేంద్ర ప్రభుత్వ పనిదినాలలో మాత్రమే స్వీకరిస్తామని, మార్చి 21 హోళి సందర్భంగా, మార్చి 23 నాల్గవ శనివారం, మార్చి 24 ఆదివారం నాడు నామినేష్లను స్వికరించబడవని, పోటికి ఆకాంక్షించే అభ్యర్థులు వీటిని గమనించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కోన్నారు.