యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడం ద్వారా రెండు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అయితే తెలంగాణలో అధికారం సాధించవచ్చునని అంచనా వేసుకున్న భారతీయ జనతా పార్టీ గత ఐదేళ్లలో ఊహించని కనిష్టానికి పడిపోయింది. తెలంగాణలో ఓట్ల శాతం గణనీయంగా పడిపోయి జాతీయ స్థాయి పార్టీ అని చెప్పుకోవడానికే సిగ్గుపడే స్థితికి దిగజారింది.2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బిజెపి తెలంగాణలో 8.7 శాతం ఓట్లు సాధించింది. తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా 45 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసిన బిజెపి కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి కాలంలో తెలుగుదేశం పార్టీని వదిలేస్తే మరింత బాగా ఎదగవచ్చునని బిజెపి ప్రణాళిక వేసుకుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు నష్టం జరిగిందని అలా కాకుండా ఉంటే సొంతంగా మరిన్ని ఎక్కువ సీట్లు, ఓట్లు సాధిస్తామని బిజెపి అంచనా వేసుకున్నది. జాతీయ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు జరగకముందే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి విమర్శించడం ప్రారంభించింది. ఆ తర్వాతి పరిణామాలలో తెలుగుదేశం, బిజెపిలు భయంకరమైన శత్రువులుగా మారిపోయాయి. ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతి పరిణామాలలో కాంగ్రెస్ వైపు చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణపై బిజెపి గంపెడు ఆశలు పెట్టుకున్నది. కేసీఆర్‌కు సీట్లు తగ్గుతాయని, తమకు పెరుగుతాయని అనుకుంది. అలా సీట్లు పెరిగితే కేసీఆర్‌తో రాజకీయ బేరం కుదుర్చుకోవచ్చునని జాతీయ స్థాయిలో బిజెపి లెక్కలు వేసుకున్నది. జాతీయ స్థాయిలో తమకు సీట్లు తగ్గితే కేసీఆర్ ఆ లోటును భర్తీ చేస్తారని, రాష్ట్రంలో ఆయనకు సాయం అందించి ఉభయతారకంగా ఉండవచ్చునని బిజెపి అనుకున్‌ంది. అందుకే కేసీఆర్ అడగగానే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ఓకే అనేసింది. తీరా చూస్తే రెండు జాతీయ పార్టీలనూ, ప్రాంతీయ శక్తులను మట్టిగలిపి కేసీఆర్ అప్రతిహతమైన విజయాన్ని సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు ఆరుగురు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్ మంత్రులు తెలంగాణలో ప్రచారం చేశారు. కేసీఆర్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రజలు బిజెపి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అయితే 2018 మే నెల నుంచి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటి నుంచి ఆయన ఓ అరడజను సార్లు తెలంగాణలో విస్తృత పర్యటనలు జరిపారు. బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నట్లుగా క్యాడర్‌కు కూడా నమ్మకం కలుగ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అయితే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. నాలుగు చోట్ల ప్రధాన సభలు నిర్వహించారు. బిజెపి టిక్కెట్ల కోసం నాయకులు బారులుతీరారు. బిజెపి టిక్కెట్ల కోసం బడా నాయకులకు డబ్బులు కూడా ఇచ్చినట్లు కొందరు అప్పటిలో బాహాటంగానే చెప్పారు. తీరా చూస్తే గతంలో కన్నా ఓట్ల శాతం ధడేలున పడిపోయి 7.07 శాతానికి చేరింది. ఐదు సీట్లున్న బిజెపి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత తెలంగాణ బిజెపి నాయకులకు మొహం చెల్లకుండా పోయింది. కనీసం ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించుకోలేదు. కేసీఆర్ ప్రభంజనం ముందు తట్టుకోలేకపోయామని, తమ తప్పేంలేదన్నట్లు బాధ్యత నుంచి తప్పుకున్నారు. అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు…. అన్న సామెత లాగా తెలంగాణ బిజెపి నాయకులకు తాము ఓడిపోయినందుకు కాకుండా కేసీఆర్ మజ్లీస్ పార్టీని చంకనెక్కించుకుంటున్నందుకు తీవ్రంగా బాధపడుతున్నారు. ఇప్పడు టిఆర్ ఎస్, మజ్లీస్ పార్టీలు మిత్ర పక్షాలైపోయాయి. వారి మధ్య విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఇదే కాంబినేషన్‌తో వెళ్లేందుకు ఇరు పార్టీలూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ కాంబినేషన్ పని చేస్తే ఇక బిజెపి పని జాతీయ స్థాయిలో కూడా మనుగడకు దూరం అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు బిజెపి సిద్ధం కావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఏమీ చలనం కనిపించడం లేదు. తెలంగాణలో బిజెపి మృతతుల్యమైందని జాతీయ పార్టీ కూడా ఒక అంచనాకు వచ్చినట్లుంది. రాష్ట్ర స్థాయి నాయకులతో మాట్లాడటం కానీ, ఏం చేస్తున్నారని అడగడం కానీ, శ్రద్ధ చూపడంగానీ చేయడం లేదు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలపైనా పూర్తిగా ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తున్నది. కనీసం సిట్టింగ్ సికింద్రాబాద్ స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం కూడా బిజెపి చేయడం లేదు. ఎన్నికల్లో ఎవరు నిలబడతారా అని అందరిని వాకబు చేసి బలవంతంగా కొందరిని ఒప్పించే దుస్థితికి బిజెపి వచ్చింది. తెలంగాణలో బిజెపి అభ్యర్ధులను నిలబెట్టినా ఎవరికి డిపాజిట్ వస్తుందో లెక్కవేసుకునే స్థితిలోనే బిజెపి ఉందని ఒక బిజెపి సీనియర్ నాయకుడే వ్యాఖ్యానించారు.